కూటమి పొత్తులో మొట్టమొదట రాజీపడింది నేనే

2
0

కూటమి పొత్తులో మొట్టమొదట రాజీపడింది నేనే

  • పదవుల పంపకం గురించి మాట్లాడుతున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలి
  • జనసేన, తెలుగుదేశం, బీజేపీ కనీసం 15 ఏళ్లకు పైగా కలిసే ఉంటాయి
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు పరుగెడుతున్న ప్రాంతం
  • పవన్ కళ్యాణ్ స్వయంగా కమిటీలను నిర్ణయిస్తారు
  • వైసీపీ లిక్కర్ నుంచి ల్యాండ్ వరకూ అన్నింటినీ అవినీతి మాయం చేసింది
  • అనకాపల్లి కార్యవర్గం సమావేశంలో ఎమ్మెల్సీ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు

జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి పొత్తులో రాజీపడిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని, కూటమి పొత్తు ధర్మంలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించిన మరుక్షణమే అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడుగా పోటీ నుంచి తప్పుకున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు కె. నాగబాబు స్పష్టం చేశారు. అనకాపల్లిలో నిర్వహించిన జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం సమావేశంలో నాగబాబు మాట్లాడారు. కూటమి పొత్తు ధర్మమే ప్రథమ ప్రాధాన్యతగా నడుచుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఉంటుందని పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంలో పదవుల పంపకం గురించి మాట్లాడుతున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలని అన్నారు. చాలామంది నేతలు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా అభివర్ణిస్తారని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి వైపు పరిగెడుతున్న ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామని, ఆ కోవలోనే తాము ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు నాగబాబు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకూ జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే విషయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం లిక్కర్ నుంచి ల్యాండ్ వరకూ దేనిని వదలకుండా అన్నింటినీ అవినీతి మాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కనీసం మరొక 15 ఏళ్లకు పైగా కచ్చితంగా కలిసే ఉంటాయని ప్రకటించారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మొదటగా తన పేరు ప్రకటించిన నేపథ్యంలో కొంత కాలం పాటు అనకాపల్లిలో ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టామని, పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ అభ్యర్థికి ఆ సీటు కేటాయించడంతో పొత్తు ధర్మానికి అనుగుణంగా తప్పుకున్నట్లు తెలిపారు. తదనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో నియోజకవర్గంలో పని చేయడం ఎంతో అదృష్టంగా భావించానని, తద్వారా చాలా సంతృప్తి చెందానని అన్నారు. తనకిష్టమైన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే దిశగా నడిపించడం కోసం ఉత్తరాంధ్రను ఎంచుకోవడం జరిగిందని, ఉత్తరాంధ్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, ఉత్తరాంధ్ర నాయకులంటే ఎంతో గౌరవమని అతి త్వరలోనే ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అనకాపల్లి శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ ఇతర సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కూడా చేయలేని పనులు మనం ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించామని పవన్ కళ్యాణ్ చొరవతో ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరులో 500 కిలోమీటర్లు మేరకు రూ.350 కోట్లతో 200 గ్రామాలు కలుపుతూ కొత్త రోడ్లు వేయగలిగామని అన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు, అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్, ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి జిల్లా, అరకు, పాడేరు, భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here