ఎన్టీఆర్ జిల్లా, జులై 18, 2025
కచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగస్వాములుకండి
- యువ ఓటర్ల నమోదును ప్రోత్సహించండి..
- బీఎల్వో శిక్షణ తరగతులను పూర్తిచేశాం
- డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం
ఎలాంటి తప్పులు లేని కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో రాజకీయ పక్షాలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని, అర్హులైన యువ ఓటర్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్వో లక్ష్మీనరసింహం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026, జనవరి 1 రిఫరెన్స్ తేదీగా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఆదేశాలు జారీఅయినందున దీనికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఈసీఐ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఎల్వోలకు నియోజకవర్గ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించామని, ఇవి విజయవంతంగా ముగిశాయని తెలిపారు. రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకొని, గుర్తింపు కార్డులు అందజేయాలన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో 1,792 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని.. వీటిలో 1,200 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నవి 295 ఉన్నాయని.. ఈ అంశాలను మరోసారి పరిశీలించి, అనంతరం హేతుబద్దీకరణకు ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు వివరించారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను బీఎల్వోకు తెలియజేయాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, ఓటరు కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించి దరఖాస్తుల పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరారు. జిల్లాలో ఫారం 6, ఫారం 7, ఫారం 8 అర్జీలకు సంబంధించి ప్రస్తుత వివరాలను తెలియజేసి సమాచారాన్ని రాజకీయ పక్షాలకు అందించారు. దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాజకీయ పక్షాల ప్రతినిధుల సందేహాలను డీఆర్వో నివృత్తి చేశారు.
సమావేశంలో ఎన్నికల సెల్ డిప్యూటీ తహాసీల్దార్ ఏఎస్ఆర్ గోపాలరెడ్డి, ఏడుపాటి రామయ్య (టీడీపీ), తరుణ్ కాకాని (బీజేపీ), పి.డేనియల్ (బీఎస్పీ), డీవీ కృష్ణ (సీపీఐ-ఎం), జి.సురేష్ (ఐఎన్సీ), వై.ఆంజనేయరెడ్డి (వైఎస్ఆర్సీపీ) పాల్గొన్నారు.