*విజయవాడ *తేది 28.07.2025*
ఆర్జీల పరిష్కారంలో నిర్థిష్టమైన స్పష్టత ఉండాలి.
పారదర్శకంగా జవాబు దారితనంతో అర్జీలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.
ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమం ద్వారా అందే ఆర్జీలను పారదర్శకంగా, జవాబు దారితనంతో నిర్థిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్)) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్జీదారుల నుండి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయిస్తారన్నారు. ఆర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా నిర్థేశించిన సమయంలో పరిష్కరించాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించిన ఉపేక్షించబోనని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి ఆర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు. పిజిఆర్‌ఎస్‌లో నమోదు అయ్యే ఆర్జీల పరిష్కారం పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
192 అర్జీల నమోదు
రెవెన్యూ శాఖకు సంబంధించి 60, విద్య 34, పోలీస్ శాఖకు 17, ఎంఏయుడి 12, అటవీ 10, పంచాయతీరాజ్ 9, సర్వే 8, పౌరసరఫరాలు 7, హెల్త్ 6, బిసి కార్పొరేషన్ 3, ఉపాధి కల్పన 3, మార్కెటింగ్ 3, ఏపిసిపిడిసిఎల్ 2, డిఆర్‌డిఏ 2, మత్స్య 2, ఇంటర్మీడియేట్ 2, రిజిస్టేషన్ అండ్ స్టాంప్స్ 2, వ్యవసాయం, ఏపిఎస్‌ఆర్‌టిసి, ఏపిఎస్‌డబ్య్లుఆర్‌ఇఐఎస్, విభిన్న ప్రతిభావంతులు, డ్వామా, జలవనరులు, ఎల్‌డిఎం, ఆర్‌డబ్ల్యుఎస్, సోషల్ వెల్ఫేర్, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం కు సంబంధించిన ఒక్కో అర్జీతో కలిపి మొత్తం 192 అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వి నాంచారరావు, ఎసిపి కె. వెంకటేశ్వరరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.