ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
•రాష్ట వ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లుఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి
•పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం
•ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఐ.డి. ప్రూఫులుగా చూపించాల్సి ఉంటుంది
•ఈ నెల 6 వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర లబించనుంది
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, ఆగస్టు 4: కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల 15 న తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పథకం అమల్లో ఎటు వంటి లోటుపాట్లు, విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు. వారి ఆదేశాల మేరకు ఇటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణా రాష్ట్రాలో అమలు తీరును పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. ఈ నెల 6 వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర లబించనుందని మంత్రి తెలిపారు. ఈ పధకాన్ని రాష్ట్రంలో సమర్థ వంతంగా అమలు పర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగరిదన్నారు. ఈ పథకం క్రింద రాష్ట్రానికి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకశాన్ని కల్పించడం జరిగిందన్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని, అయితే ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఐ.డి. ప్రూఫులుగా చూపించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో 74 శాతం బస్సులు అంటే 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. తద్వారా ఏడాదికి దాదాపు రూ.1,950 కోట్ల వ్యయం అవుతుందన్నారు. ఈ ఏడాది అదనంగా 3 వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరిగిందని, వచ్చే రెండెళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సులో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. డిమాండుకు తగ్గట్టుగా డ్రైవర్లు, మెకానిక్ ల నియామకాలను కూడా చేపడతామన్నారు.