ఎన్‌టీఆర్ జిల్లా, జులై 20, 2025
అక్షర శక్తి ముందు తూటా శక్తి నిలవలేదు..
- *కవులు, రచయితలకున్న శక్తి అసామానం
- సృజనాత్మక రచనలో పోటీలు నిర్వహిస్తాం
- నేటి తరం కవులలో రచనా ప్రతిభను వెలికితీసేందుకు సమష్టి కృషి అవసరం
- ప్రణామం కవి సమ్మేళనంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
మేధో వికాసం మానవ ఉనికికి అంతిమ లక్ష్యం కావాలన్న డా. బీఆర్ అంబేడ్కర్ సూక్తి. ని నిజం చేస్తూ భావి తరానికి వెలుగుబాట వేసేలా మంచి ఆలోచనలకు సలక్షణంగా అక్షర రూపమివ్వడం ఓ కళ అని.. అయితే నేటి తరంలో ఆ రచనా శక్తి, ఆసక్తి తగ్గుతోందని.. విద్యార్థి దశ నుంచే సృజనాత్మక రచనా నైపుణ్యాలను పెంచేందుకు సమష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
విజయవాడ బందరురోడ్డులోని డా. బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ఆవరణలో ఆదివారం మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ ఆధ్వర్యంలో ‘ప్రణామం’ కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కలెక్టర్ లక్ష్మీశ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు, రచయితలకున్నశక్తి అసామాన్యమైనదని, వారి కలం నుంచి జాలువారిన అక్షర శక్తి ముందు తూటా శక్తి కూడా నిలవలేదని పేర్కొన్నారు. అర్ధవంతమైన రచనలు సమాజ దిశను దశను మార్చుతాయని, సమాజంలోఎన్నో విప్లవాత్మక మార్పులకు కలం, గళమే కారణమని అన్నారు. నేటి తరంలో రచనా నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక ప్రకారం కృషిచేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ప్రత్యేక పోటీలు నిర్వహించి, ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. ఎవరూ చదవడం లేదని రచయితలు బాధపడాల్సిన అవసరం లేదని.. మీరు రాయడం మానేస్తే చరిత్రలో తప్పకుండా శూన్యం ఏర్పడుతుందన్నారు. సమాజంలోని వివిధ సమస్యలపై రచయితల నుండి రచనలు ఆహ్వానించి ఉత్తమ రచనల్ని ఎంపిక చేసి వాటిని ఒక పుస్తకంగా ముద్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ బాధ్యతను మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ తీసుకోవాలన్నారు. స్మృతివనం లాంటి గొప్ప ప్రదేశాల్లో ఇలాంటి గొప్ప సాహితీ కార్యక్రమాలు మరెన్నో జరగాల్సిన అవసరముందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
కార్యక్రమంలో సుప్రసిద్ధ కవులు శ్రీరామకవచం సాగర్, డా. ఎం.ప్రభాకర్, వ్యాఖ్యాన శిరోమణి వేముల హజరత్తయ్య గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ ఘంటా విజయ్కుమార్, మల్లెతీగ కలిమిశ్రీ, బుక్ ఆఫ్ భారత్ రికార్డ్స్ డా. ఎస్ దుర్గాకుమార్ పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని చొప్పా రాఘవేంద్రశేఖర్ పర్యవేక్షించగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన 80 మంది కవులు తెలుగు భాష, ప్రపంచశాంతి, పర్యావరణం, దేశభక్తి, సామాజిక చైతన్యం అంశాలపై కవితాగానం చేశారు. డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా కవులు ప్రమాణం చేశారు.