విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన 10వ జాతీయ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2025 పోటీలకు ప్రత్యేక అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడల్లో ప్రతిభచూపి పతకాలు సాధించాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి పుట్టిన ఊరుకు జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించడం జరిగిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదగాలన్నారు. 10వ జాతీయ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2025 పోటీలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యిమంది క్రీడాకారులు పాల్గొన్నారు.