చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్

0

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు

  • ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు
  • జిజియా పన్నుపై సినిమాలో సునిశితంగా చర్చించాం
  • మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చెప్పాం
  • నా సినిమాను బాయ్ కాట్ చేసినా నాకు ఫరక్ పడదు
  • నా అభిమానులే నాకు కొండంత బలం
  • శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి
  • హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్

‘చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి మంచితనాన్ని తక్కువగా చెప్పి ఇతర దేశాల నుంచి వచ్చి మనల్ని పాలించిన వారి గొప్పతనాన్ని ఎక్కువగా చెప్పారు అనిపిస్తుంది. భారతదేశాన్ని కేవలం 200 ఏళ్లపాటు పాలించిన మొఘల్స్ గురించిన మంచితనం అధికంగా ప్రస్తావించారు. బాబర్, అక్బర్, షాజహాన్ వంటి మొఘల్ రాజుల గొప్పతనాన్ని ఎక్కువగా చూపించి, ఔరంగజేబు వంటి రాజు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు అనిపిస్తుంది. మన కాకతీయ రాజులు, కృష్ణదేవరాయులు, రాణి రుద్రమ వంటి పరిపాలకుల చరిత్ర తక్కువగా కనిపిస్తుంది. అందుకే ఔరంగజేబు కాలంలో హిందువుగా బతకాలంటే జిజియా పన్ను కట్టే దారుణమైన రోజులను హరిహర వీరమల్లు చిత్రంలో సునిశితంగా చర్చించాం. ఔరంగజేబు చనిపోయి ఇంతకాలమైన అప్పటి దారుణాలను చెప్పాలంటే ఇప్పటికి చాలా మంది భయపడతారు. నాకు అలాంటి భయాలు లేవు. చరిత్రలో జరిగిన విషయాలను హరిహరవీరమల్లు చిత్రం ద్వారా ప్రజలకు తెలిసేలా చెప్పడం ఆనందంగా ఉంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, హరిహర వీరమల్లు చిత్ర కథానాయకులు పవన్ కళ్యాణ్ చెప్పారు. గురువారం రాత్రి హైదరాబాద్ దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావడంతో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఔరంగజేబు కాలంలో చీకటి రోజులను ఆ కాలంలో సామాన్యులు పడిన ఇబ్బందులను చిత్రంలో చక్కగా చూపించాం. మొఘల్స్ సామ్రాజ్యంలో మంచితోపాటు చెడును చెప్పాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. నేను ఏమీ చేసినా భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, దేశ ఉన్నతిని బలంగా చెప్పాలని చూస్తాను. నా మనసు అంతా భారతదేశపు ఆత్మ నిండిపోయి ఉంది. చిత్రం పార్ట్-2 కూడా 20 శాతం పూర్తయ్యింది. దీనిలో ఖాన్ అబ్దుల్ గఫూర్ ని దృష్టిలో పెట్టుకొని కొంత భాగం చిత్రీకరించాం.
• ప్రేక్షకుడు భావోద్వేగం చెందాలి
ముఖ్యంగా అప్పటి పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా కష్టం తీసుకోవాలి. హరిహర వీరమల్లు చిత్రం కథ విన్న తరువాత దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చాలా కాలం మదించాను. తోట తరణి లాంటి ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకు దొరకడం మా అదృష్టం. ఇలాంటి పిరియాడికల్ చిత్రం ప్రేక్షకుడిని పూర్తి భావోద్వేగంతో నింపి ఎన్నో గొప్ప అనుభూతులను ఇంటికి తీసుకెళ్లేలా చేస్తుంది. నా జీవితం మొదట నుంచి వడ్డించిన విస్తరి కాదు. ప్రతి రోజు జీవితంతో సంఘర్షిస్తూనే ఉంటాను. గత వారం రోజులుగా చిత్రం ప్రమోషన్ల నిమిత్తం సరైన నిద్ర లేదు. పూర్తి అలసటగా ఉన్నాను. ఇలా గత 28 ఏళ్లలో ఏ చిత్రానికి చేయని ప్రమోషన్లను ఈ చిత్రానికి చేశాను. ఏ.ఎం. రత్నం లాంటి నిర్మాతకు నా వంతు సాయం చేయాలని బలంగా భావించడం వల్లే ఇంత శ్రమించాను.
నన్ను విమర్శించే కొందరు, రాజకీయ ప్రత్యర్థులు నా చిత్రాలను బాయ్ కాట్ చేస్తామని చెబుతున్నారు. నేను అస్సలు దీనిని పట్టించుకోను. బాయ్ కాట్ చేసినా నాకు వచ్చిన ఇబ్బంది లేదు. నేను నటించిన ఒక సినిమా మిమ్మల్ని ఇంతలా భయపెడుతోంది అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగామో అర్థమవుతోంది. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు. ఎవరైన మన గురించి పూర్తి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే కచ్చితంగా మనం చాలా బలంగా ఉన్నామని అర్థం. నేను ఇంత బలంగా ఉన్నానంటే నా అభిమానులు ఇచ్చిన బలమే.

  • సినిమా చాలా ప్రభావితం చేసే మాధ్యమం
    ఒకప్పుడు భారతదేశంలో విదేశీ సంగీతం విస్తృతంగా వ్యాప్తి చెందిన సమయంలో భారతీయ సంగీతం గొప్పతనాన్ని, దాని ప్రాముఖ్యాన్ని అత్యంత అద్భుతంగా ప్రేక్షకులకు చూపించిన సినిమా శంకరాభరణం. ఆ సినిమా చూసిన తరువాత కర్ణాటక సంగీతం మీద, భారతదేశపు సంగీతం ఔన్నత్యం మీద గొప్ప అభిప్రాయం ఏర్పడింది. సినిమా మనిషిని బలంగా ప్రభావితం చేస్తుంది. సినిమాలోని కథ, కథనం, పాత్రలు కచ్చితంగా మన ఆలోచనను మారుస్తారు. దానిలో లీనమయ్యేలా మారుస్తాయి. అంతటి గొప్ప బలం సినిమాకు ఉంది. హరిహర వీరమల్లు సినిమా చూసిన చాలా మంది కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టినట్లు చెబుతున్నారు. దానిని కచ్చితంగా సరిదిద్దుకుంటాం. నా అభిమానులు సున్నితంగా అయిపోవద్దు. శత్రువు ఎంత బలంగా మనపై దాడి చేస్తే అంత బలంగా ఎదుర్కొని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. కోహినూర్ వజ్రం కంటే విలువైన గొప్ప ధర్మం భారతదేశంలో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, జ్ఞానం, విజ్ఞానం, కలగలిపిన గొప్ప భూమి ఇది. దీనినే చిత్రంలోనూ చూపించాం. నాకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా వాటిని అధిగమిస్తూనే నా జీవిత ప్రయాణాన్ని గొప్పగా ఎంజాయ్ చేస్తాను. ప్రతి కష్టాన్ని దాటుకొంటూ కాలర్ ఎగరేయకుండా… ఆ దాటే క్రమాన్ని చక్కగా అనుభవాలు, అనుభూతులుగా మిగుల్చుకుంటాను. హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సహకరించిన పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ కి, నిర్మాత రత్నం కి ధన్యవాదాలు, చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, చిత్ర బృందానికి అభినందనలు’’ అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version