ఎన్‌టీఆర్ జిల్లా, జులై 24, 2025
లక్ష్యాల సాధనకు బంగారు బాటలు వేసుకోండి
- ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి
- నాణ్యమైన విద్యతో పాటు సరైన నడవడికా ముఖ్యమే
- డ్రగ్స్ దుష్పరిణామాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తున్నాం
- ప్రతి పాఠశాలల్లోనూ కెరీర్ కౌన్సెలింగ్ తరగతుల నిర్వహణ
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరంగా మెరుగైన మార్పులు చేయడంతో ప్రవేశాలు పెరిగాయని, వీటిని సద్వినియోగం చేసుకొని కెరీర్ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు బంగారు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు.
విజయవాడ కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాలను కలెక్టర్ లక్ష్మీశ గురువారం మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా.. లేదా? ఆహారం నాణ్యత ఎలా ఎంది? వంటి విషయాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 370 మంది విద్యార్థులుండగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. సన్నబియ్యంతో పోషక విలువలతో కూడిన భోజనం చాలా బాగుంటుందోని, తామంతా ఇక్కడే తింటున్నామని చిన్నారులు చెప్పారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ కెరీర్ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. బాగా చదవడంతో పాటు సరైన ప్రవర్తన కూడా ముఖ్యమని.. ఇవి రెండూ ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థ బాగా మెరుగుపడిందని.. పిల్లలు, తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. చిన్నారులను అన్ని విధాలా సరైన దారిలో నడిపించే లక్ష్యంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెగా పీటీఎం నిర్వహించిందని.. ఇందులో భాగంగా నిర్వహించిన గ్రీన్ పాస్‌పోర్ట్, తల్లికి వందనం వంటి వినూత్న కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యాయన్నారు. చిన్నప్పటి నుంచే విలువలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు సరైన దిశగా వెళ్లేలా ప్రోత్సహించడం జరుగుతోందని.. మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలుపైనా అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కెరీర్ కౌన్సెలింగ్ తరగతులు నిర్వహించేందుకు చొరవ తీసుకోవడం జరుగుతోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ వెంట పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం.నరసింహాచార్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు.