ఎన్‌టీఆర్ జిల్లా, జులై 24, 2025
ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు కృషిచేయండి..
- ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించండి
- నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, జాబ్ మేళాల నిర్వహణపై దృష్టిపెట్టండి
- జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఉండాలి
- ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌షిప్‌లపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
స్వర్ణాంధ్ర విజన్ @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా దార్శనిక ప్రణాళికల రూపకల్పన జరిగిందని, శాఖల వారీగా కీలక పురోగతి సూచికలు (కేపీఐ)లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెట్టి, రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
గురువారం కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయం, మత్స్య, పట్టు పరిశ్రమ, సాంఘిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర విజన్ – కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా శాఖల వారీగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సూచికల్లో ప్రగతి మొత్తం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ప్రగతి సూచికల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. 30 శాఖలకు సంబంధించి 523 కీలక ప్రగతి సూచికలు ఉన్నాయని.. వ్యవసాయ శాఖకు సంబంధించి ఏడు సూచికలున్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి, ఆదాయానికి ప్రకృతి సాగు దోహదం చేస్తుందని, ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తుల సాధన అనేది ఆరోగ్య ఆంధ్ర సాకారానికి కీలకమన్నారు. మనతో పాటు భవిష్యత్తు తరాలు రోగాలు బారినపడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యమని వివరించారు. స్థానిక పరిస్థితులు, వనరులు ఆధారంగా రైతులను ఉద్యాన పంటలు దిశగా ప్రోత్సహించాలని.. జీవన ఎరువులు ఉపయోగించడం వల్ల ఎరువుల భారం తగ్గుతుందన్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడేలా సీసీఆర్‌సీ కార్డుల ద్వారా సత్వరం బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎక్కడా రుణాలు మంజూరు కాలేదనే పరిస్థితి ఉండకూడదన్నారు. వార్షిక రుణ ప్రణాళికల ఆధారంగా రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్ ద్వారా యువతకు జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయని.. వీటి ఆధారంగా మెరుగైన కెరీర్‌ను అందుకునేందుకు వీలుంటుందన్నారు. వీటికి సంబంధించిన స్కీమ్‌లను యువత సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్వయం ఉపాధి మార్గాలపైనా అవగాహన కల్పించాలని.. ఇందుకు అందుబాటులో ఉన్న పీఎంఈజీపీ, స్టాండప్ ఇండియా వంటి పథకాలను ఉపయోగించుకునేలా చేయిపట్టి నడిపించాలన్నారు. నైపుణ్యాభివృద్ది విభాగానికి సంబంధించి మొత్తం ఆరు సూచికలు ఉన్నాయని.. వీటిలో పురోగతికి కృషిచేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్‌తో పాటు వసతి గృహాల్లో ప్రవేశాలపై దృష్టిసారించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.