ఎన్టీఆర్ జిల్లా/నందిగామ, జులై 22, 2025
పంట మార్పిడితో పదిలమైన ఆదాయం
- ఉద్యాన పంటలు దిశగా రైతులు ముందడుగు వేయాలి
- పశు పోషణతోనూ మెరుగైన అదనపు ఆదాయాలు
- స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్లో అన్నదాతల భాగస్వామ్యం కీలకం
- పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
వివిధ రకాల పంటలను ఒక క్రమపద్ధతిలో పండించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని.. తెగుళ్లు, కలుపు మొక్కలు వంటి సమస్యలతో పాటు ఎరువుల అవసరమూ తగ్గుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం నందిగామ మండలం, కేతవీరునిపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి ప్రస్తుతం ఏ పంటలు పండిస్తున్నారు.. ఏవైనా సమస్యలు ఉన్నాయా.. వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్ల, పూల మొక్కల సాగును చేపట్టవచ్చని, ఉద్యాన పంటలతో రైతులకు అధిక, సుస్థిర ఆదాయాలు లభిస్తాయన్నారు. పశుపోషణ ద్వారా కూడా అదనపు ఆదాయం పొందొచ్చని, ప్రస్తుతం ప్రభుత్వాలు అందుబాటులో ఉంచిన పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అగ్రీటెక్పైనా అవగాహన:
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రతి మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని, ఇందులో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల అధికారులూ పాల్గొంటున్నారన్నారు. సాగు పరంగా రైతుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి శాస్త్రవేత్తలు, అధికారుల ద్వారా సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ రకాల పథకాల ప్రయోజనాలను వివరిస్తూ వాటిని ఉపయోగించుకునేలా చేయిపట్టి నడిపిస్తున్నట్లు వివరించారు. అగ్రీ టెక్పైనా అవగాహన కల్పిస్తున్నామని, సాగు ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెరిగేలా సలహాలు సూచనలు ఇస్తున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధితో పాటు రైతుల జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరగడం కూడా ముఖ్యమన్నారు. పశుపోషణలో మేలైన మార్గాలను అవలంబించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచేందుకు తద్వారా పాడి రైతులకు అదనపు ఆదాయం వచ్చేందుకు వీలుగా పైలట్ ప్రాజెక్టుగా కేతవీరునిపాడులో యానిమల్ హాస్టల్ ప్రారంభించే యోచనలో ఉన్నామని, ఇందుకు రైతులు కూడా సుముఖంగా ఉన్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు.
నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతులకు తమ సాగు సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు కంది విత్తనాల కిట్లను, జీవన ఎరువుల బాటిళ్లను ఉచితంగా అందజేశారు.
కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, పశుసంవర్థక అధికారి డా.ఎం.హనుమంతరావు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.