అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, సెంట్రల్ డివిజన్, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ తేదీ. 22.04.2025
ఎలక్ట్రికల్ బైక్ ల దొంగతనం కేసులలో ముగ్గురు నిందితుల అరెస్ట్
నిందితులు వద్ద నుండి Rs.10 లక్షల రూపాయలు విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్ లు స్వాధీనం
ఎన్.టి.ఆర్ జిల్లా, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, ఇన్ ఛార్జ్ డీసీపీ కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో సెంట్రల్ డివిజన్ ఏ.సి.పి డి. దామోదర రావు ఆద్వర్యంలో, మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్. ప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక
బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే అనుమానితుల కదలికల పై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ క్రమంలో ప్రత్యేక బృందానికి రాబడిన సమాచారం మేరకు ది. 21.04.2025 వ తేదిన ఉదయం మాచవరం, ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా రెండు ఎలక్ట్రికల్ బైక్ లపై ముగ్గురు వ్యక్తులు వెళ్ళుచూ పోలీసు వారిని గమనించి ఎలక్ట్రికల్ బైక్ లను వెనుకకు తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించుచుండగా వారిని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్ లను స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుల వివరాలు
1. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం ఏరియాకు చెందిన షేక్ బాషా (35 సం.)
2. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, ఉండి ఏరియాకు చెందిన జక్కంశెట్టి దుర్గాప్రసాద్ (26 సం.)
3. విజయవాడ, వాంబే కాలనీ కి చెందిన సయ్యద్ యూసఫ్ (28 సం.)
విచారణలో నిందితులలో ప్రధాన నిందితుడు షేక్ బాషా పదో తరగతి వరకు చదువుకొని కొంతకాలం కారు డ్రైవర్ గా పనిచేసి, అనంతరం ఎలక్ట్రికల్ బైక్ లను రిపేరు చేయడం నేర్చుకొని మెకానిక్ షాప్ ఏర్పాటు చేసుకున్నాడు, మెకానిక్ పని చేయగా వచ్చిన డబ్బులు తన జల్సాలకు సరిపోక ఏవిధంగానైనా డబ్బులు సంపాదించాలని తాను నేర్చుకున్న మెకానిక్ పనితో ఎలక్ట్రికల్ బైక్ లను దొంగతనం చేసి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో జల్సా చేయాలనుకుని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రికల్ బైక్ లను వైర్ లను కలిపి దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని మిత్రులు అయిన జక్కంశెట్టి దుర్గా ప్రసాద్ మరియు సయ్యద్ యూసఫ్ లతో కలిసి దొంగతనాలు చేసారు.
వీరు ముగ్గురు ఐదు నెలల కాలంలో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కైకలూరు, తాడేపల్లి, మరియు విజయవాడ ఏరియాలలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్ లను దొంగతనం చేయడం జరిగింది.
సాంకేతిక ఆధారాలు ఉపయోగించుకొని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనం కేసులను చేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం ఇన్స్పెక్టర్ మరియు మాచవరం సబ్ ఇన్స్పెక్టర్ ఏ.వి. శ్రీనివాస్ ని మరియు సిబ్బంది అయిన PC-1905 సిహెచ్. రమేష్, PC-1693 ఎమ్.సుభాష్ కుమార్, PC-293 ఏ.తరుణ్ కుమార్ వర్మ లను అధికారులు అభినందించారు.