ఎన్టీఆర్ జిల్లా, జూలై 25, 2025
అధికారులూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండండి..
- అల్పపీడనం ప్రభావంతో కురిసే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
- కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వచ్చే మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున
వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారులకు తాజా ఆదేశాలు ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మండల, డివిజన్, జిల్లాస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సూచించారు. అవసరం మేరకు తక్షణం స్పందించేందుకు వీలుగా ఇప్పటికే రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్ డీ ఆర్ ఎఫ్ ) బృందం నగరంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. డివిజన్ల స్థాయిలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేసి నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు.ఎక్కడైనా చెట్లు పడిపోతే వెంటనే తొలగించేలా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, నిత్యవసర సరుకులు పంపిణీపై ప్రధానంగా దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.