MSME ల స్థాపనలో NRI లు భాగస్వాములు కావాలి- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Spread the love

 విజయవాడ 27.06.2024

MSME ల స్థాపనలో NRI లు భాగస్వాములు కావాలి- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

నూతన పరిశ్రమల స్థాపనకు 9.39 కోట్ల రుణాల పంపిణీ, 38నూతన పరిశ్రమలకు అనుమతి పత్రాల మంజూరు

అంతర్జాతీయ చిన్నతరహా పరిశ్రమల దినోత్సవ సందర్భంగా ఈ రోజున విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు APMSME డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MSME శాఖామంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. మంత్రివర్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి శ్రీ ఎన్. యువరాజ్, వి. రామ్నాధ్ RERA ఛైర్మన్, రమేష్ గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డా||ఎమ్.ఎస్. రామ్మోహన్రావు, మేనేజింగ్ డైరెక్టర్ డా|| పి. రమేష్ జ్యోతిప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు ప్రసంగిస్తూ MSME మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మన రాష్ట్ర యువత వారి విశేష సేవలను వివిధ రంగాలలో అందిస్తున్నారు. యువత మన రాష్ట్రంలో MSME పరిశ్రమలు స్థాపిస్తే అవసరమైన మౌలిక సదుపాయాలు, సంబంధిత అనుమతులన్నీ త్వరితగతిన ప్రభుత్వం నుండి అందిస్తామని తెలియచేసారు. ప్రపంచ దేశాలలో అక్కడి ప్రభుత్వాలు కూడా MSMEలను ప్రోత్సహిస్తూ, వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారు. చైనాలో ఉన్న MSME యూనిట్లు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. బ్యాంకర్లు కూడా ముందుకు వచ్చి MSMEలు స్థాపించే యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి సులభతరంగా రుణాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేసారు. APIIC ద్వారా స్థానిక వనరులు బట్టి One District One Product కార్యక్రమాన్ని చేపడుతున్నాము. యువ పారిశ్రామికవేత్తలు ప్రపంచానికి ఏమి అవసరమో అధ్యయనం చేసి అటువంటి ఉత్పత్తులను తయారుచేసే యూనిట్లను నెలకొల్పాలి. ప్రభుత్వ ఉద్యోగం, విదేశాలకు ఉద్యోగాలకై వెళ్ళాలనే ఆలోచన మార్చుకుని ఇక్కడే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి కల్పించుకుని, దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతను కోరారు. మన రాష్ట్రంలో 20 ఏళ్ళుగా డ్వాక్రా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయి. MSME లు ద్వాక్రా మహిళల సేవలు ఉపయోగించుకుని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రతీనెల జిల్లాస్థాయిలో MSME ల సమస్యల పరిష్కారానికై ‘గ్రీవియన్స్ డే’ ను నిర్వహిస్తామని, 3 నెలలకొకసారి మంత్రిస్థాయిలో జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను రివ్యూ చేస్తామని తెలియచేసారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన NRIలందరూ వారి స్వస్థలాలకు తిరిగి వచ్చి వారి వారి ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు స్థాపించడం లేదా అటువంటి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

అంతర్జాతీయ MSME వేడుకలను రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాప్సియా) మరియు APMSME డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ప్రసంగిస్తూ MSME లకు ప్రత్యేకంగా ఒక మంత్రిని కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేసారు. దేశవ్యాప్తంగా MSME ల స్థాపనలో మన రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. MSME ల సమాచారం సరిగ్గా అందుబాటులో లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు MSMEలపై సర్వే నిర్వహించి వారి సమస్యలను గుర్తించాలని నిర్ణయించాయి. ఈ సర్వేకు FAPSIA, ఇతర MSME ల అసోసియేషన్లు సహకారం, సలహాలు అందించాలని కోరారు. MSMEలు బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నుండి రావలసిన అనుమతులు త్వరితగతిన ఇస్తామని తెలిపారు. MSME లు కొత్త పరిజ్ఞానంతో ఉత్పత్తులను తీసుకువచ్చేలాగా యూనిట్లు స్థాపించాలని, సేవా రంగానికి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. MSME అసోసియేషన్లు మన పక్క రాష్ట్రాలలో పర్యటించి అక్కడ ప్రభుత్వాలు MSME లకు కల్పించిన వసతులు, ప్రోత్సాహకాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చిన్న పరిశ్రమలు కొత్తగా ప్రారంభిస్తున్న 12 మంది పారిశ్రామికవేత్తలకు వివిధ బ్యాంకులు ఇచ్చిన 9.39 కోట్ల రూపాయల రుణాల చెక్కులను మంత్రివర్యులు శ్రీనివాస్ వారికి అందచేసారు.

PMEGP, MSME పథకాల క్రింద 7.29 కోట్ల రూపాయలతో పరిశ్రమలు ప్రారంభిస్తున్న 38 మందికి అనుమతి పత్రాలను మంత్రి శ్రీనివాస్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందచేసారు.

రమేష్ హాస్పిటల్స్, విజయవాడ వారు, టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సంస్థ మరియు KL యూనివర్శిటీ, విజయవాడ వారు FAPSIA సభ్యులందరికీ తమ సంస్థలలో అందించే సేవలకు ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వడానికి FAPSIA తో MOU కుదుర్చుకున్నారు. వీరు అందించిన సహకారానికి FAPSIA మీడియా కో ఆర్డినేటర్ ఎన్. వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో FAPSIA రాష్ట్ర అధ్యక్షులు వి. మురళీకృష్ణ అధ్యక్షోపన్యాసం చేస్తూ, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్ను నడిపించడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి MSME లందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో ముందుగా FAPSIA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ. పూర్ణచంద్రరావు అతిధులకు, సభ్యులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలు, అసోసియేషన్లు, బ్యాంకర్లకు, FAPSIA సభ్యులకు కార్యదర్శి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో FAPSIA మీడియా కో ఆర్డినేటర్ ఎన్. వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జిల్లా ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు.

యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాలీ సాఫ్ట్వేర్ సంస్థల ప్రతినిధులు పాల్గొని MSMEలకు వారు అందిస్తున్న స్కీమ్లు మరియు సేవల గురించి వివరించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *