జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా చేనేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత అనేది భారతదేశ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. గ్రామీణ జీవిత శైలిని ప్రతిబింబించే ఈ రంగం దేశ ఆర్థిక, సాంస్కృతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. చేనేత ఉత్పత్తులలో ఉన్న నైపుణ్యం, విలక్షణతకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని భరించనుంది. దీంతో పాటు త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి రూ.5 కోట్లు విడుదల చేయనుంది. చేనేత కళను ప్రోత్సహిస్తూ, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నదని తెలిపారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.