విద్యలో ఏపీని మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకం
మంత్రి నారా లోకేష్ ను కలిసి నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
ఎంఈవో పోస్టుల్లో జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి
ఉపాధ్యాయుల ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ
ఉండవల్లిః ప్రభుత్వ విద్యలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఎంఈవో పోస్టుల్లో జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కు వినతిపత్రం అందజేశారు. రాజకీయ జోక్యం లేకుండా ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి పారదర్శకంగా జరిగాయని, అదేవిధంగా రాష్ట్రంలో నూతనంగా మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేయడంపై ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ఇకపై ఆయా జిల్లాల్లో జరిగే క్లస్టర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతానని చెప్పారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని, అంకితభావంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోండూరు శ్రీనివాసరాజు, బొనిగెల హైమారావు, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చెరుకూరి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జె.శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్.రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.