03-08-2025
అమరావతి రాజధానితో సమానంగా విజయవాడ అభివృద్ది కి కృషి : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు త్వరలో తీరనున్నాయి
హైదరాబాద్- విజయవాడ సిక్స్ లైన్ హైవే పున్నమి ఘాట్ వరకు పొడగింపు
ఎన్టీఆర్ భవన్ లోఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు
విజయవాడ : అమరావతి రాజధానితో సమానంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్దికి ఎమ్మెల్యేల సహకారంతో కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జాతీయరహదారి-30 లో ఇబ్రహీంపట్నం-చంద్రగూడెం మార్గంలో టూ లైన్ ఆర్.వో.బికి, విజయవాడ -మచిలీపట్నం సిక్స్ లైన్ హైవేకి కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్.హెచ్.ఐ అధికారులు, ఎంపీలతో జరిపిన జాతీయ రహదారుల సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు అభ్యర్ధన మేరకు హైదరాబాద్ -విజయవాడ సిక్స్ లైన్ గ్రీన్ హైవే ఎక్స్ ప్రెస్ ను విజయవాడ పున్నమి ఘాట్ వరకు పొడిగించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించటమే కాకుండా, అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. ముందు హైదరాబాద్ -విజయవాడ సిక్స్ లైన్ హైవే ఔటర్ రింగ్ రోడ్డు వరకు మంజూరైంది. నెల రోజుల క్రితం ఆ మార్గాన్ని గొల్లపూడి వరకు పొడిగించేందుకు కృషి తను కృషి చేసినట్లు తెలిపారు. రాజధాని ప్రజలకు మరింత సౌలభ్యంగా వుండేందుకు సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ వరకు ఆ హైవే పొడిగించాల్సిందిగా కోరటం జరిగిందన్నారు. విజయవాడలోని జాతీయ రోడ్ల అభివృద్దికి సహకరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలం నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. దీపం కింద మూడు ఉచిత సిలిండర్లు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నదాత సుఖీభవలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు.. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తనకి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులకు, నాయకులు,కార్యకర్తలకు ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు.