వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో సింగపూర్ రూ.45వేల కోట్ల పెట్టుబడులు! మంత్రి నారా లోకేష్

0
0

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో సింగపూర్ రూ.45వేల కోట్ల పెట్టుబడులు!

చంద్రబాబు నేతృత్వంలో సింగపూర్ పర్యటన విజయవంతం

రికార్డులను సరిచేయడానికి సింగపూర్ పర్యటనకు వెళ్లాం

పెట్టుబడులను అడ్డుకునేందుకు తప్పుడు ఈ-మెయిల్స్ పెట్టించారు

గత పదేళ్లలో వచ్చిన పెట్టుబడులకంటే 14నెలల్లో వచ్చిందే ఎక్కువ

విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, శాఖల మంత్రి నారా లోకేష్

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో 4రోజులపాటు విజయవంతంగా సింగపూర్ లో పర్యటన పూర్తిచేశాం, రాబోయే అయిదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఎపిలో 45వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం, ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్ కు బ్యాడ్ న్యూస్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో 4రోజుల పాటు నిర్వహించిన సింగపూర్ టూర్ విశేషాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 1995 నుంచి సింగపూర్ తో చంద్రబాబుగారికి అనుబంధం ఉంది. సింగపూర్ లో మాకు తెలుగువారు ఘనస్వాగతం పలికారు, సింగపూర్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 2వేలమంది తెలుగువారు వచ్చారు, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలు కంపెనీల నుంచి కమిట్ మెంట్స్ తీసుకున్నాం, రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 8 నుంచి రాత్రి 11.30వరకు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. సిఎంతో పాటే మేం కూడా పోటీపడి పనిచేస్తున్నాం.

రికార్డులను సరిచేయడానికే వెళ్లాం

అధికారంలో ఉన్నా, లేకపోయినా చంద్రబాబుని అక్కడి ప్రభుత్వం గౌరవిస్తూ వస్తుంది. సిఎం నేతృత్వంలో నారాయణ, టిజి భరత్ నేను, అయిదుగురు ఐఎఎస్ లు సింగపూర్ వెళ్లాం. రికార్డులను సరిచేయడానికే వెళ్లాం. గతంలో వారితో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దుచేసి సింగపూర్ కంపెనీలను తరిమేశారు. ప్రపంచవ్యాప్తంగా పారదర్శకతలో టాప్ – 5లో సింగపూర్ ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్రవేసేందుకు ప్రయత్నించారు. దీనివల్ల భారతదేశం కూడా నష్టపోయింది. మన రిప్యూటేషన్ పోయింది. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ ధర్మన్ షణ్ముగ రత్నం, మంత్రి టాన్ సీలింగ్ తో సహా అక్కడ ప్రభుత్వ పెద్దలందరితో చర్చలు జరిపాం. నాలుగురోజుల్లో ముఖ్యమంత్రి 26 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. నేను 19 పారిశ్రామికవేత్తలతో చర్చలతో సహా 35 కార్యక్రమాలకు హాజరయ్యాను. టువాస్ పోర్టు, జురాంగ్ పెట్రో కెమికల్స్, ఐటి, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, స్పోర్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలతో చర్చించాం.

పెట్టుబడులను అడ్డుకునేందుకు కుట్ర

మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి మంత్రులు, అధికారులు, హైకమీషనర్ కు రాష్ట్రంలో అస్థిరమైన ప్రభుత్వం ఉందని, పెట్టుబడులు పెట్టొద్దని ఈ – మెయిల్ పంపారు. మేం ఆరా తీస్తే ఆ వ్యక్తి పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీతో, వైసిపి నేతలతో తరచూ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఇటువంటి కుట్రలకు తెరలేపారు. టిసిఎస్ కు 99 పైసలకే భూములిస్తే కోర్టులో కేసులు వేశారు. అయితే వారికి కోర్టు అక్షింతలు వేసింది. అడుగడుగునా అభివృద్ధిని, పెట్టుబడులను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. చెన్నయ్ లో ఒక కంపెనీకి ఇబ్బంది వస్తే రాజకీయాలకు అతీతంగా అక్కడ రాజకీయా పక్షాలన్నీ సింగపూర్ హైకమిషనర్ వద్దకు వెళ్లారు. రాజకీయ పోరాటం చెన్నయ్ వరకే, బయటకు వచ్చాక మేమంతా తమిళనాడు వాళ్లం, రాష్ట్రం కోసం కలసికట్టుగా ప్రయత్నిస్తామని వారు చెప్పారు. మన రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధి కోసం బాండ్స్ విడుదల చేస్తే ఆర్ బిఐ నుంచి అందరికీ ఈ-మెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఇటువంటి వారివల్లే ఎపి బ్రాండ్ పడిపోతుంది. ఆ మెయిల్స్ చదువుతుంటే చాలా బాధేస్తుంది. బాబుగారి పేరు చెప్పి మేం కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. యుఎఇ మంత్రి ఇటీవల భారత్ పర్యటనలో విజయవాడ వచ్చాకే పక్క రాష్ట్రానికి వెళ్లారు. వైసిపి వారు మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారు. వైసిపి నాయకుల చర్యల వల్ల ఎపితో పాటు ఆ దేశంలో ఉన్న తెలుగువారు నష్టపోతున్నారు.

ఎపి బ్రాండ్ ను నాశనం చేసిన జగన్

2019నుంచి 24వరకు ఎపి బ్రాండ్ ను జగన్ నాశనం చేశాడు. అంతకుముందు సింగపూర్ సంస్థలు, ఎపి చేసుకున్న ఒప్పందాన్ని కనీసం చర్చించకుండా రద్దుచేశారు. ఎపికి అత్యధిక టాక్స్ పేయింగ్ కంపెనీ అయిన అమర్ రాజాను పక్క రాష్ట్రానికి తరిమారు. భారతదేశంలో అది పెద్ద మాల్ డెవలపర్ లులూ గ్రూప్ ఒప్పందం కూడా రద్దుచేశారు. దీనివల్ల నాశనమైంది ఎపి బ్రాండ్, 2024 ఎన్నికల్లో అందుకే ఎన్ డిఎ కూటమిని ప్రజలు గెలిపించారు. ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి నినాదం. అనంతపురంకు కియా, కర్నూలుకు రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశం జిల్లాకు రిలయన్స్ కంప్రెస్ట్ బయోగ్యాస్ ప్రాజెక్టు తెచ్చాం. అమరావతికి దేశంలోనే తొలిసారిగా జనవరిలో 158 క్యూబిక్ క్యాంటమ్ కంప్యూటర్ తెస్తున్నాం. కర్నూలుకు డ్రోన్ సిటీ, క్యాంపా కోలాలాంటి కంపెనీలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకు డేటాసిటీ, ఫార్మాకంపెనీలు, ఐటి పరిశ్రమలు, భారత్ లోనే అతి పెద్ద ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. కంపెనీల వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ కు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణాకు హైదరాబాద్, కర్నాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నయ్ ఉంటే ఎపికి చంద్రబాబు ఉన్నారని ఆనాడు చెప్పాను. ఆయన సిఎం కావడంవల్లే పోయిన బ్రాండ్ తిరిగి వచ్చింది.

పట్టుదలతో పరిశ్రమలు రప్పిస్తున్నాం

సిబిఎన్ 4.0 అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 2024లో గెలిచిన వెంటనే ఆదిత్య మిట్టల్ తో జూమ్ కాల్ లో చర్చించాను. ఎన్ ఎండిసి రా మెటీరియల్ కోసం సిఎంతో మాట్లాడి గ్రీన్ సిగ్నల్ ఇప్పించాను. ప్రధానితో ఈ విషయమై 3సార్లు చంద్రబాబు మాట్లాడారు. త్వరలో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తాం. 2029 నాటికి కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో డాటా సెంటర్స్ ఏర్పాటుకు పలు సందేహాలు. కొన్ని కీలకమైన సమస్యలున్నాయి. 4 సమస్యలను పరిష్కరిస్తే విశాఖపట్నంలో డాటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ఒక ప్రముఖ సంస్థ మాకు చెప్పింది, వాటన్నింటినీ పరిష్కరించాం. భారతదేశంలోనే అతిపెద్ద డాటా సెంటర్ విశాఖకు రాబోతోంది. ముంబాయి వెళ్లి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో చర్చలు జరిపా. దాంతో టాటా పవర్, టిసిఎస్ రాష్ట్రానికి వచ్చాయి. టాటా పవర్ 7గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటుచేయబోతోంది. విశాఖకు టిసిఎస్ ను రప్పించేందుకు ఎకరా 99పైసల చొప్పున 20ఎకరాలు ఆ సంస్థకు ఇచ్చాం. విశాఖకు ఐటి మ్యాప్ లోకి తెచ్చేందుకు ఇలా చేశాం. దావోస్ కి వెళ్లినపుడు కాగ్నిజెంట్ సిఇఓను కలిశా. విశాఖవస్తే 99 పైసలకు భూమి ఇస్తామని టిసిఎస్ రావడంతో ఆ తర్వాత కాగ్నిజెంట్ వచ్చింది. రాబోయే నాలుగేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిలో రాష్ట్రాలతోపాటు దేశాలతో పోటీ పడుతున్నాం. మా కృషి ఫలితంగా 2014 నుంచి 24 వరకు జరిగిన ఎంఓయుల కంటే 14నెలల్లో జరిగిన ఒప్పందాలే ఎక్కువ. రాష్ట్రాభివృద్ధి కోసం పట్టుదలతో పనిచేస్తున్నాం.

యువతకు ఉద్యోగాల కోసమే కంపెనీలకు భూములు

మేము భారతీ సిమెంట్స్, హెరిటెజ్ కు భూములు ఇవ్వలేదు, యువతకు ఉద్యోగాలు ఇచ్చే టిసిఎస్, కాగ్నిజెంట్స్, డాటా సెంటర్ లకు ఇచ్చాం, ఎస్ఐపిబి పెట్టి మూడురోజుల్లో కేబినెట్ కు తెచ్చి ఐటి సంస్థలకు అనుమతులు ఇచ్చాం. ఎపికి పెట్టుబడులు రావాలి, 2029కల్లా ఉద్యోగాలు ఇవ్వాలన్న కండీషన్ తో భూములిచ్చాం. ప్రధాని మోడీజీ నుంచే మాకు 99 పైసలకు భూములు కేటాయించే ఐడియా వచ్చింది. మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నపుడు పశ్చిమ బెంగాల్ అంగీకరించకపోతే టాటా మోటార్స్ నానో పరిశ్రమకు తక్కువ ధరకు భూములు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆ నిర్ణయం కరెక్టు అని చెప్పింది, వేలకోట్ల భూములు కట్టబెడుతున్నామని ఆరోపణలు చేసేవారు గత ప్రభుత్వంలో ఒక్క ఎకరం ఎందుకు అమ్మలేకపోయారు? లులూకి ఇచ్చిన భూమి ఆక్షన్ కు పెడితే గతంలో ఒక్కడూ ముందుకు రాలేదు. వాళ్ల మాటవింటే రాష్ట్రం నష్టపోతుంది. పెట్టుబడుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. 1995లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని హేళన చేశారు. సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారాయి. హాస్పిటాలిటీ, రిటైల్ రంగంలో మాగ్జిమమ్ జాబ్స్ వస్తాయి. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో 50వేల హోటల్ రూమ్ లు రావాలని సిఎం డైరక్షన్ ఇచ్చారు. విశాఖ, తిరుపతి, కర్నూలు, అమరావతి, కాకినాడ, రాజమండ్రిలో పెద్దఎత్తున హోటల్స్ రాబోతున్నాయి. ఉద్యోగాల కల్పనే మా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో గత14నెలల్లో పెద్దఎత్తున ఎంఎస్ఎంఇ పరిశ్రమల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. త్వరలోనే ప్రోత్సాహకాలు విడుదల చేస్తాం. ఎంఎస్ ఎంఇల కోసం ఒక ప్రత్యేక మోడల్ వర్కవుట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక నెలలో ఆ మోడల్ ను కేబినెట్ ముందుకు తెస్తాం.

ప్రభుత్వాల కొనసాగింపుతోనే అభివృద్ధి

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు అవసరం. ప్రభుత్వ కొనసాగింపువల్ల స్థిరమైన పాలసీలు కొనసాగి ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగి పెట్టుబడులు వస్తాయి. 2014-19 నడుమ అయిదేళ్లలో రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తెచ్చాం, ఆ తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ కంపెనీలన్నింటినీ తరిమేసింది. ఇప్పుడు మేం పెట్టుబడుల కోసం వెళితే మళ్లీ వారు రారని గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. కేంద్రంలో మూడువిడతలుగా ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వికసిత్ భారత్ నినాదంతో 20147నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా మోడీజీ పనిచేస్తున్నారు. మేం 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒకే ప్రభుత్వం ఉండటం వల్లే చైనా, సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధి సాధించాయి.

రాష్ట్రాభివృద్ధికి రోడ్ సింగపూర్ రోడ్ మ్యాప్

సింగపూర్ పర్యటన సందర్భంగా మేము అక్కడ ఒక మంత్రిగారిని కలిశాక ఆయన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. 2019లో ఏకపక్షంగా ఒప్పందాలు రద్దుచేశారని అందులో వాపోయారు. విజన్ లేని వ్యక్తి కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి సిఎం కావడం వల్లే రాష్ట్రం గత అయిదేళ్లలో తీవ్రంగా నష్టపోయింది. జగన్ తన హయాంలో నీకెంత, నాకెంత అని తప్ప, పరిశ్రమలు, పెట్టుబడుల గురించి ఆలోచించలేదు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్తుంటే బాధపడ్డాం. వేధింపులు తాళలేక అమర్ రాజా, హెరిటేజ్ కూడా పొరుగురాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాయి. సింగపూర్ పారిశ్రామికవేత్తలతో జరిగిన చర్చల్లో చంద్రబాబు మేము మీతో ఉన్నాం, కలసికట్టుగా పనిచేద్దామని భరోసా ఇచ్చారు, రాష్ట్రానివృద్ధి కోసం అద్భుతమైన రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్ ఏర్పాటుచేశామని భరోసా చెప్పారు. అమరావతితోపాటు ఎస్ఇజడ్ లు, పోర్టుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెడతామని వారు చెప్పారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఏదేశం మార్పునకు సిద్ధంగా ఉంటుందో ఆ దేశం ఎక్కువ ఉద్యోగాలను సాధిస్తుంది. అందుకే కరిక్యులమ్ లో ఎఐ అండ్ ఎంఎల్ ఉండాలని ఉన్నత విద్య చైర్మన్ కు సష్టంగా చెప్పాం, క్వాంటమ్ కంప్యూటింగ్ తెస్తున్నాం. 1995లో ఒక్క సైబర్ టవర్ తో హైదరాబాద్ లో ఐటి రెవెల్యూషన్ మొదలైంది. ఈరోజు మైక్రోసాఫ్ట్, ఐఎస్ బి వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ అక్కడకు వచ్చాయి. చంద్రబాబు ముందు చూపువల్లే హైదరాబాద్ అంతలా అభివృద్ధి చెందింది.

సింగపూర్ ముందుచూపు అద్భుతం

టువాస్ పోర్టుకు వెళ్లినపుడు అక్కడ టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయాం. 2040నాటికి మిగిలిన అన్నిపోర్టులను మూసేసి టువాస్ పోర్టునుంచే జలరవాణా కార్యకలాపాలు నిర్వహించాలని వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సింగపూర్ కు స్వాతంత్రం వచ్చాక లీక్వానీ అక్కడి అధికారులను చైనా, ఇతరదేశాలు పంపి అధ్యయనం చేశారు. రాష్ట్రంలో కూడా ఐఎఎస్, ఐపిఎస్ లలో కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సి ఉంది. వేగవంతమైన అభివృద్ధి కోసం సెక్టార్ వైజ్ ట్రైనింగ్ చేయాలని సింగపూర్ అధికారులు మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది, రాష్ట్రాన్ని నెం.1 చేయడమే మా లక్ష్యం.

సెప్టెంబర్ లో విశాఖకు టిసిఎస్!

ఈ ఏడాది సెప్టెంబర్ లో విశాఖపట్నంలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ లో కాగ్నిజెంట్ వస్తుంది. ఎపి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన సిఎం సింగపూర్ నుంచే ఆదేశాలు ఇచ్చారు. తప్పుడు ప్రచారం వల్ల స్టార్టప్ కంపెనీలకు అనుమానాలు వస్తాయి. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆర్ బిఐ, సెబీకి మెయిల్స్ పంపారు, ఇప్పుడు సింగపూర్ లో మినిస్టర్స్, సెక్రటరీలకు పంపారు, నిన్న కోర్టులో కేసు వేశారు. అయితే చంద్రబాబు గురించి సింగపూర్ ప్రభుత్వానికి తెలుసు. అందుకే వారి ఫిర్యాదులను పక్కన బెట్టారు. బాబు అంటే సింగపూర్ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం. గతంలో వారు లీక్వాని , ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ లకు సిఎంగారిని ఆహ్వానించారు. భూముల విషయంలో వైసిపి నాయకులు చెప్పినట్లు చేస్తే హెచ్ సిఎల్ వచ్చేది కాదు, ఈరోజు అక్కడ 4,500 మంది పనిచేస్తున్నారు. పరిశ్రమలకు సంబందించి మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 5వేల ఎకరాలు ఎందుకు అని ఆనాడు ప్రశ్నించారు. ఈరోజు భారత్ లోనే బెస్ట్ ఎయిర్ పోర్టుగా హైదరాబాద్ తయారైంది. వందేళ్లకు సరిపడా విస్తరించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టు సరిపోకపోవడంతో బెంగుళూరులో రెండో ఎయిర్ పోర్టు కడుతున్నారు. ముందుచూపుతో ఆలోచించి చంద్రబాబుగారు సిఎంగా ఉన్నపుడు హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో డిజైన్ చేశారు, బాబు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాటిని కొనసాగించారు, అదే హైదరాబాద్ అదృష్టం, జగన్ మాదిరిగా అక్కడ అడ్డుపడలేదు, జగన్ లాంటి నాయకుడు ఉండటం మన రాష్ట్ర దౌర్భాగ్యం.

పెట్టెల లెక్క జగన్ కే బాగా తెలుసు!

లిక్కర్ కుంభకోణంలో పెద్దఎత్తున డబ్బు పట్టుబడటంపై విలేకరుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ స్పందిస్తూ… ఇందులో ఎంతమొత్తంలో చేతులు మారాయో జగన్ ను అడిగితే లెక్కలు ఇస్తారు. ఏ పెట్టెలో ఎంత డబ్బు పడుతుందో ఆయనకు బాగా తెలుసు. గత ప్రభుత్వ హయాంలో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కల్తీ మద్యంపై పోరాడాం. కూటమి ప్రభుత్వం వచ్చాక పారదర్శకమైన పాలసీ తెచ్చాం. లిక్కర్ కుంభకోణంలో నగదుతోపాటు పలు ఎకౌంట్లకు చెక్ ద్వారా డబ్బులు వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం కొంటుందా, లిక్కర్ బంగారంతో తయారుచేస్తారా? అవినీతి సొమ్ముతో కూడా అద్భుతమైన ఇన్వెస్టిమెంట్ చేయవచ్చని నిరూపించారు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కు ఇదొక గొప్ప ఉదాహరణ. అదాన్ డిస్టిలరీ నుంచి పిఎల్ ఆర్ కంపెనీకి డబ్బులు వెళ్లింది, అక్కడ నుంచి జగన్ కు వెళ్లింది. డబ్బు తమ ఎకౌంట్ కు వచ్చిన మాట నిజం కాదని పెద్దిరెడ్డిని చెప్పమనండి. పిఎల్ఆర్ సంస్థ ఒక అవినీతి కంపెనీ. లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ ఆర్ కు ఎందుకు డబ్బు వెళ్లింది అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. పెద్దిరెడ్డిపై వ్యక్తిగత కక్ష ఉంటే 2014 నుంచి 19 నడుమ బయట తిరిగే వారా? తప్పు చేశారు కనుకే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం.

ఎమర్జెన్సీ పరిస్థితులుంటే బయట తిరగగలరా?

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్న జగన్ వ్యాఖ్యలపై లోకేష్ స్పందిస్తూ… అటువంటి పరిస్థితులే ఉంటే జగన్ బయట తిరిగే వారా? స్వేచ్చగా హెలీకాప్టర్ లో తిరుగుతున్నారు, ఆయనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నాం. నెల్లూరు జగన్ పర్యటించే ప్రాంతంలో కన్ స్ట్రక్షన్ జరుగుతుంటే మట్టితీశారు, దానిని మాపై మాపై ఎలా రుద్దుతారు? అనంతపురం పర్యటన సమయంలో వైసిపి వాళ్లు హెలీకాప్టర్ అద్దం పగులగొడితే 16లక్షల నష్టమొచ్చిందని అద్దెకు ఇచ్చిన సంస్థ వాపోయింది. మాజీ సిఎం బయటకు వెళితే 3వేలమందిపోలీసులను వినియోగిస్తున్నాం. సిఎం వెళ్లినా అంత భద్రత లేదు. ఈరోజు కూడా నెల్లూరు పర్యటనలో వైసిపివాళ్లు పోలీసులను కొట్టారు, మేం పోలీసులు లేకుండా చేస్తే జగన్ ఎక్కడికైనా వెళ్లగలరా? మేం ఆయన మాదిరిగా సొంత కార్యకర్తలను చంపలేదు. తల్లిపైన కేసు గెలిచాక సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనే మాత్రమే. తల్లి, చెల్లిపైనా ఎవరైనా కేసు పెడతారా? 2021లో వారికి ఇచ్చిన గిప్ట్ డీడ్ ను లాగేసుకున్న నాయకుడు ఆయన. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివాడు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తారు? రాజ్యాంగం అందరికీ తిరిగే స్వేచ్చ ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేం అమలుచేస్తున్నాం. జగన్ పర్యటనకు వెళ్లినపుడు పోలీసులు క్రౌడ్ ను రెగ్యులేట్ చేస్తున్నారు, ఆయనపై జనం పడితే మళ్లీ మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెబుతారు. మందు, డబ్బు ఇచ్చి జనాన్ని వారి కార్యక్రమాలకు తోలుతున్నారు. గతంలో సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జగన్ కారుకింద పడి ఒక వ్యక్తి చనిపోయారు, ఒకరు గుండెపోటుతో మరణించారు, అంబులెన్స్ లో చిక్కుకొని మరొకరు చనిపోయారు. అటువంటివి జరగకుండా రెగ్యులేట్ చేస్తే తప్పు ప్రభుత్వానిది అంటారు. జగన్ లా మేం గేట్లకు తాళ్లు కట్టడం లేదు. చంద్రబాబు ఇంటిచుట్టూ 144వ సెక్షన్ అమలు చేయడం లేదు. నేను తరచూ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నా. ప్రతిదీ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాం. తప్పులుంటే సరిచేసుకుంటాం. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబుతో సహా మా ప్రభుత్వంలో ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించరు.

రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం

బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణా నేతల ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ… కాళేశ్వరం ప్రాజెక్టుకు మేం ఏనాడు అడ్డుపడలేదు. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను మేం లిఫ్ట్ చేసుకుని ఉపయోగించుకుంటే తప్పేంటి? మిగులు జలాలను రాయలసీమకు తీసుకువెళ్తే వారికి ఇబ్బంది ఎందుకు? ఆ మాటకొస్తే రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ లేకుండా కాళేశ్వరం ఎలా కట్టారు? కొందరు రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగువారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణాలో పెట్టుబడులను మేం ఏనాడైనా అడ్డుకున్నామా? తెలుగువారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారు నెం.1గా ఉండాలన్నదే మా లక్ష్యం. తెలుగువారి సంక్షేమం కోసమే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించింది ఎపి భూభాగంపైన. అక్కడొక రూల్, ఇక్కడొక రూలా? ఆంధ్రకు ఒకనీతి, తెలంగాణాకు ఒక నీతా? తెలంగాణా నీళ్లు మేం తీసుకుంటున్నామా? బనకచర్లపై పూర్తిస్థాయి చర్చ జరగాలని మేం కోరుకుంటున్నాం. నదుల అనుసంధానం అత్యవసరం. నీళ్లకోసం యుద్ధాలు జరుగతున్నాయి. మేము ఎవరి నీళ్లను దోచుకోవడం లేదు. గోదావరి దేవుడిచ్చిన వరం. కృష్ణా వరద నీరు తరలించి 80శాతం రిజర్వాయర్లను నింపాం. లైనింగ్ చేసి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాం. అది మా కమిట్ మెంట్. 94శాతంతో ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ప్రతిఏటా వందల టిఎంసిల నీరు సముద్రంలోకి వెళ్తుంది. మిగులు జలాలు ఉన్నపుడే లిఫ్ట్ చేస్తాం. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలంగాణాతో కలసి పనిచేస్తామని చెప్పాం, తప్పేముందని మంత్రి లోకేష్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here