చాట్రాయి/ ఏలూరు, జూలై , 27 : గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలన నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పయనింపచేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. చాట్రాయి మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పార్థసారధి పాల్గొన్నారు. ముందుగా చిత్తాపూర్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ నిధులు రూ.83. 80 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం తుమ్మగూడెం గ్రామంలో ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పోలవరం గ్రామంలో ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేతకానితనంతో రాష్ట్రంలో అభివృద్ధిని అధోగతిపాలు చేసిందని 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. అభివృద్ధి దార్శినికుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ఇప్పటికే పెట్టుబడిదారులు ముఖ్యమంత్రి మీద నమ్మకంతో 8 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా రాష్ట్రానికి అందించి పరిశ్రమలు ఏర్పాటుచేశారని, రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదన్నారు. సంక్షేమంలో గత ప్రభుత్వం కన్నా తమ ఎక్కువ చేసిందని, గత ప్రభుత్వం పెన్షన్ గా సంవత్సరానికి 27 వేలు, అమ్మఒడి 15 వేలు, చేయూత 18 వేలు మొత్తం సంవత్సరానికి 69 వేల రూపాయలు అందిస్తే, తమ ప్రభుత్వం పెన్షన్, బకాయిలు 51 వేలు, తల్లికి వందనం సగటున ఇద్దరు పిల్లలకు 30 వేలు, ఉచిత గ్యాస్ 3వేలు, అన్నదాత సుఖీభవ కింద 20 వేలు, మత్స్యకారులకు 20 వేలు, తదితర సంక్షేమ కార్యక్రమాలతో సంవత్సరానికి లక్ష రూపాయలకు పైగా ఒక్కొక్క కుటుంబానికి అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 20 వేల కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారులు, 4, 500 కోట్ల రూపాయలతో గ్రామంలో సిసి రోడ్లు వేశామని, అయినప్పటికీ ఇంకా చేయవలసి ఉందన్నారు. సహకార సంఘాలు రుణ అర్హత కార్డులు కలిగిన కౌలు రైతులకు పంట రుణాలు అందించాలని, అదేవిధంగా ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన పంటలు, మత్స్యకారులు, పాడిపశువుల రైతులకు రుణాలను అందించాలని, అదేవిధంగా చేతివృత్తుల వారికి వారి కుటుంబాల అభివృద్ధికి ఉపాధి అవకాశాలకు రుణాలు అందించాలని మంత్రి కోరారు.
రాష్ట్ర అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ సహకార రంగంలో పారదర్శకత పెరిగిందని, అన్ని సహకార సంఘాలు, సహకార బ్యాంకులలో పూర్తి కంప్యూటరైజేషన్ చేయడమైందన్నారు. గతంలో రైతులకు రుణాల మంజూరుకు ఎంతో సమయం పట్టేదని, కానీ పత్రాలు అన్ని సక్రమంగా సమర్పించిన రైతులకు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో
15 ని.ల లోగా రుణాలు అందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ , సుపరిపాలనలో తొలి అడుగు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాసరావు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.