నిత్యావసరాల ధరలపై పటిష్ట పర్యవేక్షణ కీలకం.రైతు బజార్లు, హోల్‌ సేల్‌, రిటైల్‌ షాపులలో తనిఖీలతో

2
0

ఎన్‌టిఆర్‌ జిల్లా తేది:24.07.2025

        *నిత్యావసరాల ధరలపై పటిష్ట పర్యవేక్షణ కీలకం..*
         *రైతు బజార్లు, హోల్‌ సేల్‌, రిటైల్‌ షాపులలో తనిఖీలతో గట్టి నిఘా ఉంచండి..*
        *సమిష్టి కృషితో  సామాన్య ప్రజల ప్రయోజనాలు కాపాడుదాం..*          
                         *జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ.*

వినియోగదారుల ప్రయోజనాలకు భరోసా కల్పించేలా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపై పటిష్ట పర్యవేక్షణ అవసరమని, బ్లాక్‌ మార్కెట్‌ వంటి చర్యలకు పాల్పడకుండా గట్టి నిఘా ఉంచాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ అధికారులను ఆదేశించారు. 

నగరంలోని జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో గురువారం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ అధ్యక్షతన జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ  కమిటీ సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్‌, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కూరగాయల ధరల్లో వ్యత్యాసాలు, నగరంలోని ó హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌, కాళేశ్వరరావు రిటైల్‌ మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా విజయవాడ రైతుబజార్లలో నిర్ణయించిన ధరలు, బియ్యం, కందిపప్పు, పామాయిల్‌ తదితర నిత్యావసర సరుకుల ధరల్లో మార్పుల పై సమావేశంలో చర్చించారు. 

ఈ సందర్భంగా జాయింట్‌  కలెక్టర్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర, వ్యవసాయ, ఇతర వస్తువుల ఉత్పత్తి ధోరణులు, ప్రస్తుత ధరలు, భవిష్యత్తు ధరలపై అంచనాల  సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి ధరలు నియంత్రణకు  పటిష్ట  చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లు, హోల్‌ సేల్‌, రిటైల్‌ షాపులను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏదైనా వస్తువు ధర ఒక్కసారిగా పెరిగితే యుద్ధప్రాతిపదికన స్పందించి, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా  మార్కెటింగ్‌ జోక్యంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం నిత్యావస సరుకుల ధరలు స్థిరంగా ఉన్నాయని, అయితే పచ్చి శనగపప్పు ధర విషయంలో కొద్దిగా పెరిగినట్లు గమనించి దాల్‌ మిల్లర్లు, వర్తకులకు  ధర తగ్గింపు పై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పచ్చి శనగపప్పుకు ప్రత్యామ్నాయంగా బఠానీలను కూడా వినియోగించవచ్చునని తెలియజేయాలన్నారు.  టమాటా ధరలు గత వారంతో పోలిస్తే కొంత పెరిగినట్లు గుర్తించామని, చిత్తూరు జిల్లాలో టమాటా పంట చివరి దశలో ఉండడం, తమిళనాడు వ్యాపారస్తులు చిత్తూరు మార్కెట్‌లో టమాటాలను కొనుగోలు చేయడం వల్ల ధరలు కొద్దిగా పెరిగినట్లు  అధికారులు జాయింట్‌ కలెక్టర్‌కు వివరించారు. టమాట ధరలు పెరిగినట్లయితే చిత్తూరు జిల్లా నుండి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు వినియోగదారులకు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ అధికారులను ఆదేశించారు.  

 సమావేశంలో డీఎస్‌వో ఎ.పాపారావు, జిల్లా అగ్రీట్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌ అధికారి బి. రాజాబాబు, జిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ నాగేశ్వరరావు, రైసు మిల్లర్ల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ ఉధ్యాన శాఖల అధికారులు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here