ఎన్‌టీఆర్ జిల్లా, జులై 23, 2025
పీ4లో మహిళా పారిశ్రామికవేత్తలు భాగస్వాములుకండి
- ఫిక్కీ మహిళల మార్గదర్శనంతో బంగారు కుటుంబాలకు ఆసరా
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న నిరుపేదలకు ఆసరాను అందించి, జీవితంలో స్థిరపడేలా ఫిక్కీ మహిళాపారిశ్రామికవేత్తలు మార్గదర్శకులుగా నిలవాలని.. ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో అమలుచేస్తున్న పీ4 విధానంలో భాగస్వాములుగా ముందుకురావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్‌వో)- విజయవాడ ప్రతినిధులతో బుధవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో పీ4 విధానం అమలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని సమూలంగా నిర్మూలించి, 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించాలనే లక్ష్యంతో పీ4 విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేదలు పూర్తిస్థాయిలో పేదరికం నుంచి బయటపడలేకపోతున్నారనే విషయాన్ని గుర్తించి, పీ4 విధానంలో మార్గదర్శులు ద్వారా నిరుపేదలైన బంగారు కుటుంబాలను ఎంపిక చేసుకొని వారిని దత్తత తీసుకోవడం ద్వారా ఆయా కుటుంబాలు వారు ఆర్థికంగా, కుటుంబ పరంగా ఆశించిన స్థాయిలో ఆర్థిక, ఆరోగ్య పరిపుష్టిని సాధించేవరకు చేయూతనివ్వడం ముఖ్య ఉద్దేశమన్నారు. పీ4 విధానం ద్వారా బంగారు కుటుంబాన్ని ఎంపిక చేసుకొని ఆ కుటుంబంవారు ఎదుర్కొంటున్న సమస్యలను గమనించి విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ఆసరా ఇచ్చేందుకు ఆర్థిక పరిపుష్టి సాధించిన వారు మార్గదర్శులుగా ముందుకురావాలని సూచించారు. జిల్లాలో 86 వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని, ఇప్పటికే దాదాపు 3,700 మంది మార్గదర్శులు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఎఫ్ఎల్‌వో మహిళా పారిశ్రామికవేత్తలు.. సామాజిక దృక్పథంతో నిరుపేదలను ఆదుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో తమవంతు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాల సాధనకు పీ4 విధానంలో భాగస్వాములై బంగారు కుటుంబాలకు ఆసరా అందించాలని కలెక్టర్ లక్ష్మీశ మహిళా పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎఫ్ఎల్‌వో ప్రతినిధులు స్పందిస్తూ తమ సంస్థ ఆధ్వర్యంలో త్వరలో సమావేశాన్ని నిర్వహించి బంగారు కుటుంబాలను వ్యక్తిగతంగా, సంస్థ పరంగా ఎంపిక చేసుకొని అండగానిలిచేందుకు తమవంతు కృషిచేస్తామని తెలిపారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు పీ 4 విధానం ఎంతో వినూత్నమైనదని.. ఇందులో భాగస్వాములు కావడం తమవంతు బాధ్యతగా గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.
సమావేశంలో ఎఫ్ఎల్‌వో – విజయవాడ సీనియర్ వైస్ ఛైర్‌పర్సన్ సుప్రియా మాలినేని, సెక్రటరీ సుమబిందు అట్లూరి, ట్రెజరర్ తుల్జాభవానీ దేవినేని, జాయింట్ సెక్రటరీ దీప్తి చలసాని, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య పాల్గొన్నారు.