ఏఐతో బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

2
0

ఏఐతో బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ

• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
• త్వరలో యాప్ రూపొందించనున్నట్లు వెల్లడి
• పీ-4 మోడల్ తో హాస్టళ్ల దత్తత
• వచ్చే నెల 5లోగా హాస్టళ్లలో అడ్మిషన్లు ముగించాలి..
• ఆగస్టు 30లోగా మరమ్మతులు, మరుగుదొడ్లు నిర్మించాలి…
• అన్ని బీసీ హాస్టళ్లలోనూ ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు
• హాస్టళ్లలో రాత్రి బస చేయాల్సిందే
• డీబీసీడబ్ల్యూఈవో, ఏబీసీడబ్ల్యూఈవోలు, ఈడీల సమావేశంతో మంత్రి సవిత

విజయవాడ : ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన యాప్ రూపొందించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏఐతో బీసీ హాస్టళ్ల జవాబుదారీతనం మరింత పెరగనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 30లోగా హాస్టళ్లకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదరణ 3.0 ద్వారా కుల వృత్తుదారులకు ఆధునిక పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో బుధవారం ఆయా జిల్లాల బీసీ సంక్షేమ శాఖాధికారులు, డీబీసీడబ్ల్యూఈవోలు, ఏబీసీడబ్ల్యూఈవోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. ముందుగా బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్ల నిర్వహణ తీరుతెన్నులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ వివరించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల అయిదో తేదీలోగా అడ్మిషన్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. ముఖ ఆధారిత గుర్తింపు(ఫేషియల్‌ రికగ్నైషన్‌ బేస్డ్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌ – ఎఫ్‌ఆర్‌ఎస్‌) ద్వారా విద్యార్థుల హాజరులో ఆటంకాలు ఏర్పడితే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారించుకోవాలన్నారు. వచ్చే నెల అయిదో తేదీలోగా నిర్దేశించిన లక్ష్యం మేర అడ్మిషన్లు పూర్తి చేయాలని మంత్రి సవిత స్పష్టంచేశారు.

హాస్టళ్లలో రాత్రి బస చేయాల్సిందే…

బీసీ హాస్టళ్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగానే గతం ప్రభుత్వం పెట్టిన డైట్ బిల్లుల బకాయిలు చెల్లించడమే కాకుండా, ఎప్పటికప్పుడు డైట్ బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. హాస్టళ్లలో రాత్రి సమయాల్లో హెచ్ డబ్ల్యూవోలు ఉండాలని స్పష్టంచేశారు. హాస్టళ్ల పనితీరు మరింత మెరుగుపడాలంటే నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. మంత్రిగా తాను అన్ని జిల్లాల్లో ఉన్న బీసీ హాస్టళ్లను, ఎంజేపీ స్కూళ్లను ఎప్పకటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. డీబీసీడబ్ల్యూఈవోలు, ఏబీసీడబ్ల్యూఈవోలు తరుచూ హాస్టళ్లను సందర్శించాలని, వీలైతే రాత్రి బస కూడా చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి టూర్ డైరీ రూపొందించాలని, ఆ డైరీని ప్రతి నెలా అయిదో తేదీలోగా రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని తెలిపారు. హెచ్ డబ్ల్యూఎస్ లు రాత్రి సమయాల్లో హాస్టళ్లలో తప్పనిసరిగా బస చేయాల్సిందేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. విద్యార్థులను బాధ్యతతో సొంత బిడ్డల మాదిరిగా చూసుకోవాలన్నారు. సన్న బియ్యం భోజనంతో విద్యార్థుల ఆనందంగా కడుపు నింపుకుంటున్నారన్నారు.

వచ్చే నెల 30లోగా పనులు పూర్తి చేయాలి…

రాష్ట్రవ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టామని మంత్రి సవిత వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.13 కోట్లు వెచ్చించిందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో పలు హాస్టళ్లలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ పనులు ఆగస్టు 30వ తేదీ నాటికి పూర్తి చేయాలన్ని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు బిల్లులు అందజేయాలని, దీనివల్ల నిధులు త్వరితగతిన మంజూరు చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

ఏఐతో హాస్టళ్ల పర్యవేక్షణ

బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, హాస్టళ్ల జవాబుదారీ తనం మరింత పెంచేలా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఏఐ ద్వారా మెనూ అమలు, పరిశుభ్రత పర్యవేక్షణ, విద్యార్థులు, సిబ్బంది హాజరు వంటి అంశాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఏఐతో హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు భద్రతతో కూడిన విద్య అందించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

పీ-4తో హాస్టళ్ల దత్తత…

సీఎం చంద్రబాబునాయుడు స్ఫూర్తితో బీసీ హాస్టళ్ల అభివృద్ధికి పీ4 మోడల్ అమలు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మార్గదర్శకులను గుర్తించి, బీసీ హాస్టళ్లను దత్తత ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. హాస్టళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమవంతు సాయంగా ముందుకొచ్చే దాతలను గుర్తించాలని మంత్రి సవిత సూచించారు. దాతల ద్వారా సీఎస్ఆర్ నిధులు సేకరించాలన్నారు. బీసీ హాస్టళ్ల అభివృద్ధికి ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని డీబీసీడబ్ల్యూఈవోలను, ఏబీసీడబ్ల్యూఈవోలను మంత్రి సవిత ఆదేశించారు.

ఆధునిక పరికరాలతో ‘ఆదరణ’

కుల వృత్తుదారులకు ఆధునిక పరికరాల అందజేసి, వారి పెంచడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి సవిత తెలిపారు. లబ్ధిదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరికరాలను ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రూ.1000 కోట్లు మంజూరు చేసిందన్నారు. మహిళలకు అందజేస్తున్న ఉచిత కుట్టు శిక్షణ విజయవంతం కావడంపై మంత్రి సవిత సంతృప్తి వ్యక్తంచేశారు. త్వరలోనే మహిళలకు కుట్టు మిషన్లు అందజేయబోతున్నామన్నారు. కేవలం కుట్టు మిషన్లు ఇవ్వడంతోనే సరిపెట్టకుండా, వారు తయారు చేసే దుస్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని బీసీ కార్పొరేషన్ అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత, 26 జిల్లాలకు చెందిన డీబీసీడబ్ల్యూఈవోలు, ఏబీసీడబ్ల్యూఈవోలు, ఎంజేపీ స్కూళ్ల కన్వీనర్లు, బీసీ కార్పొరేషన్ ఈడీలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here