ఎన్‌టీఆర్ జిల్లా, జులై 21, 2025
ద్వారావతి దాతృత్వం ఆదర్శనీయం
- కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆకలి కడుపులను నింపి.. మానవ సేవయే మాధవ సేవగా తలచి దాతృత్వంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ద్వారావతి ఫౌండేషన్ అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
నిత్యం ఎంతోమంది ఆకలిని తీర్చుతున్న ద్వారావతి నిత్యాన్నప్రసాద సేవ ద్వారా గత నాలుగేళ్లుగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాలను వచ్చే వారికి భోజనం అందిస్తున్నారు. సోమవారం ఈ సేవా కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొని అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు చాలా దూరప్రాంతాల నుంచి సైతం ప్రజలు వస్తుంటారని.. అలాంటివారు దాదాపు 200 మంది ఆకలిని తీర్చుతున్నద్వారావతి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అన్నార్తులకు చేయూతనివ్వడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఫౌండేషన్ వైద్య సేవలను కూడా అందిస్తోందన్నారు. ప్రతి ఆదివారం విజయవాడ, నూజివీడులో ఉచిత ఆదివారం హాస్పిటల్స్ ద్వారా, ప్రతి నెలా మెగా క్యాంపులను నిర్వహిస్తూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఫౌండేషన్ చేస్తున్న కృషి చాలా ఉన్నతమైనదని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ జి.సంతోష్ కుమార్, వైస్ ఛైర్మన్ పి.సత్య, ట్రస్ట్రీ బోర్డు సభ్యులు ఎస్.విజయ్, కుమార్, సుధాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.