విప‌త్తుల వేళ ప్రాణాలు నిలిపే భీష్మ్‌..సంక్షోభ స‌మ‌యాన స‌కాలంలో వైద్య సేవ‌ల్లో ఇదో గేమ్ ఛేంజ‌ర్‌ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

4
0

ఎన్‌టీఆర్ జిల్లా, జులై 19, 2025

విప‌త్తుల వేళ ప్రాణాలు నిలిపే భీష్మ్‌..

  • సంక్షోభ స‌మ‌యాన స‌కాలంలో వైద్య సేవ‌ల్లో ఇదో గేమ్ ఛేంజ‌ర్‌
  • ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విప‌త్తుల స‌మ‌యంలో త‌క్ష‌ణం వైద్య సేవ‌లు అందించి మ‌నుషుల ప్రాణాల‌ను కాపాడే విష‌యంలో భార‌త్ హెల్త్ ఇనీషియేటివ్ ఫ‌ర్ స‌హ‌యోగ్, హిత అండ్ మైత్రి (భీష్మ్‌- BHISHM) గేమ్ ఛేంజ‌ర్ అని, సంక్షోభ స‌మ‌యంలో ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఈ పోర్ట‌బుల్ హాస్పిట‌ల్ ప్రాణాలు నిలప‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
భూకంపాలు, వ‌ర‌ద‌లు, తుపాన్లు వంటి విప‌త్తుల స‌మ‌యంలో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం భీష్మ్ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌కు మూడు భీష్మ్ క్యూబ్స్ రాగా.. వీటికి సంబంధించి శ‌నివారం జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌, వ‌ర్క్‌షాప్‌న‌కు క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ విప‌త్తుల స‌మ‌యంలో ఉప‌యోగించుకునేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా గుర్తించిన వైద్య సంస్థ‌ల్లోనూ, ఎయిమ్స్‌ల్లోనూ భీష్మ్ క్యూబ్‌ల‌ను అందుబాటులో ఉంచ‌డం జ‌రుగుతోంద‌న్నారు. విప‌త్తుల స‌మ‌యంలో అవ‌స‌ర‌మున్న చోటుకు చాలా తేలిగ్గా ఈ క్యూబ్‌ను త‌ర‌లించి, వైద్య సేవ‌లు అందించ‌వ‌చ్చ‌ని.. గోల్డెన్ హ‌వ‌ర్‌లో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అందించేందుకు భీష్మ్ క్యూబ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఈ క్యూబ్‌లో ఆధునిక టెంట్లు, మినీ ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, మందులు, స‌ర్జిక‌ల్ టూల్స్‌, అడ్వాన్స్‌డ్ మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ వంటివి ఉంటాయ‌న్నారు. ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, డేటా అన‌లిటిక్స్‌, రియ‌ల్ టైమ్ మానిట‌రింగ్ మిళితంగా ఈ భీష్మ్ వ్య‌వ‌స్థ ప‌నిచేస్తుంద‌ని వివ‌రించారు. మేకిన్ ఇండియా, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ల‌కు ఈ వినూత్న భీష్మ్ వ్య‌వ‌స్థ ప్ర‌తీక అని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here