ఎన్టీఆర్ జిల్లా, నందిగామ, జులై 19, 2025
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదాం..
- మన ఆరోగ్యాన్ని, ఆర్థిక ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ కాపాడుకుందాం
- ప్రతి గ్రామాన్నీ స్వచ్ఛ గ్రామం, స్వర్ణగ్రామంగా తీర్చిదిద్దుదాం
- సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం చట్టరీత్యా నేరం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్నీ, ఆర్థిక ఆరోగ్యాన్నీ కాపాడుకుందామని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
శనివారం నందిగామ మండలం, పెద్దవరం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి నెలా మూడో శనివారం ప్రత్యేక థీమ్‌తో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది జనవరిలో న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ట్‌తో కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ నెల ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగం దిశగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ కార్యక్రమాలను ఊరూవాడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం లేచింది మొదలు, పడుకునే వరకు రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ భాగమై పోయిందని.. ఇది ఇలానే కొనసాగితే పర్యావరణానికీ, మన ఆరోగ్యానికీ పెను ముప్పు తప్పదని, భావితరాల మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. ప్లాస్టిక్ వస్తువులను విచ్చలవిడిగా వాడి బయటపడేస్తే.. అవి డ్రెయిన్లలోకి చేరుతాయని, దాంతో కాలువలు పూడుకుపోయి మురుగునీరు రోడ్లపైకి వస్తుందన్నారు. దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలబారినపడే ప్రమాదముందన్నారు. అదేవిధంగా భూమిలోకి చేరిన ప్లాస్టిక్లు మైక్రో ప్లాస్టిక్స్‌గా మారి మనల్ని మెల్లమెల్లగా కబళించేస్తాయన్నారు. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉందామని, క్లాత్ బ్యాగ్స్, జ్యూట్ బ్యాగ్స్, పేపర్ ప్యాకింగ్ వంటివాటికి చేరువవుదామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కోసం కలిసికట్టుగా అడుగేద్దాం..
గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపాలైన వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి సమష్టిగా కృషిచేద్దామని.. మనసుంటే మార్గం ఉంటుందని, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న పాలిథీన్ కవర్లు వినియోగించినా, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులు వినియోగించినా చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తదితరాలతో ఏర్పాటుచేసిన స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. తడి చెత్త – పొడిచెత్తను సక్రమంగా, క్రమశిక్షణతో, నిబద్ధతతో వేరుచేసి ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న 12 మందికి మొక్కలు, సర్టిఫికెట్లు, జ్యూట్ బ్యాగులు అందించారు. అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్లను సత్కరించారు. స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై, ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషిచేస్తానంటూ ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో పెద్దవరం గ్రామ సర్పంచ్ బాణవత్ చిన్నదేవి, ఉప సర్పంచ్ మంగునూరి సుబ్బారెడ్డి, ఎంపీటీసీలు
సింగంశెట్టి నాగేశ్వరరావు,బాణవత్ చిలకమ్మ, గ్రామ పెద్దలతో పాటు నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, డీపీవో పి.లావణ్యకుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీఎల్పీవో రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.