స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యం
ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం
ఎక్కువ ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ బారినపడే ప్రమాదం
రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్‌లోపు తొలగిస్తాం
నేర రాజకీయాలు చేసేవాళ్లు ప్రజలకు అవసరమా.?
ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులనూ ఊడ్చేయండి
-తిరుపతిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
రేణిగుంటలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రం పరిశీలన
తిరుపతిలో కపిలేశ్వరస్వామిని దర్శించుకుని ఆలయ పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేసిన సీఎం
తిరుపతి, జూలై :- పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తే ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆతర్వాత తిరుపతి బయలుదేరి వెళ్లి కపిలేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పారిశుధ్య సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగమవ్వండి
యువత ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉంది. యువతే ఈ దేశానికి సంపద. ప్రపంచంలో ఎక్కడ చూసినా నూటికి 30 శాతం మంది మనవారే ఉన్నారు. పిల్లల్ని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగి 4వ సారి ముఖ్యమంత్రి అయ్యానంటే ఏడుకొండల స్వామి ఆశీస్సులే కారణం. స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యవ్వాలి. మన ఇల్లు, పరిసరాలు శుభ్రం చేసుకోవాలి. పల్లెలు, పట్టణాలు, చెరువులు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ఆస్పత్రులు, విద్యాలయాల్లో ప్రతి నెలా మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. చెట్లు విరివిగా నాటాలి.
అవార్డులు పారిశుధ్య కార్మికుల కృషితోనే
‘జాతీయస్థాయిలో మన రాష్ట్రానికి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడం సంతోషాన్ని ఇస్తోంది. స్వచ్ఛ్ సూపర్ లీగ్ 2024-25కు తిరుపతి, గుంటూరు, విజయవాడకు గుర్తింపు దక్కింది. ఇందులో విజయవాడ దేశంలోనే 4వ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీల్లో విజయవాడ 7వ స్థానంలో నిలిచింది. ఫైమిత్ర సురక్షిత్షెహర్ కేటగిరీలో విశాఖపట్నంకు మొదటి ర్యాంక్ వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్‌గా రాజమండ్రికి గుర్తింపు దక్కింది. ఈ అవార్డులు రావడానికి కారణమైన పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు, అధికారులు, ప్రజలు అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరే నిజమైన సమాజ సేవకులు. ప్లాస్టిక్‌ను నిర్మూలించాలనే థీమ్‌తో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్లాస్టిక్ భూతానికి ఎవరూ బలికావద్దు
‘పర్యావరణానికి ప్లాస్టిక్ అతిపెద్ద భూతంగా తయారైంది. ఈ భూతానికి ఎవరూ బలికాకూడదు. ఉదయం పళ్లు తోముకునే బ్రష్ నుంచి ఆహారం తినే ప్లేట్ వరకు అన్నింటా ప్లాస్టిక్ ఉంది. రోజు వాడి పడేసే బాటిళ్లు, కప్పులు, కవర్లు ప్రమాదకరమైనవి. ఇవి నీటిని, నేలను కలుషితం చేస్తున్నాయి. క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ కారణం. భూమిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువై వర్షం నీరు భూమిలోకి ఇంకదు. మొక్కలు మొలకెత్తవు. నీటి మూలాలు మూసుకుపోతాయి. భూగర్భ జలాలు పడిపోతాయి. ప్లాస్టిక్ వినియోగం పెరిగే కొద్దీ పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రోజూ తినే ఆహారం, నీటిలో మనకు తెలియకుండానే మైక్రో ప్లాస్టిక్స్ కలిసిపోతోంది’ అని సీఎం వివరించారు.
విషవాయులతో శ్వాస సంబంధిత వ్యాధులు
ప్లాస్టిక్ తయారీ సమయంలోనూ, వాటిని కాల్చినప్పుడు వెలువడే విష వాయువులు శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయి. క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు, కాలువలు, చెరువులకు శాపంగా మారాయి. జలచరాల మనుగడకు ముప్పుగా మారుతోంది. 120 మైక్రాన్ కన్నా తక్కువున్న ప్లాస్టిక్ బాగ్స్, వాడి వదిలే కప్పులు, ప్లేట్ల వాడకాన్ని ప్రతి ఒక్కరూ మానేయాలి. ప్లాస్టిక్ బదులుగా గుడ్డ సంచులు, మెటల్ స్ట్రాలు, కంపోస్టబుల్ ప్లేట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.
ఆగస్టు15 నాటికి ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయం
‘ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్టోబర్ 2 కల్లా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, డిసెంబర్ నాటికి రాష్ట్రమంతా దీన్ని అమలు చేస్తాం. సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాం. స్వయం సహాయ సంఘాల ద్వారా గుడ్డ సంచులు పంపిణీ చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదు. ప్రతి దాని నుంచి సంపద సృష్టించవచ్చు. స్వచ్ఛతలో తిరుపతికి అవార్డు వచ్చింది. తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. దేశవిదేశాల నుంచి ఇక్కడి వస్తారు. ఈ ప్రాంతం పరిశుభ్రంగా లేకుంటే మనపై మంచి అభిప్రాయం ఉండదు’ అని సీఎం తెలిపారు.
స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర
‘స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందు స్వచ్చాంధ్ర సాధించాలి. దీనికోసం సర్య్కలర్ ఎకానమీకి నాంది పలకాలి. సర్క్యులర్ ఎకానమీకి నమూనాగా తూకివాకంలో 300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు పెట్టాం. వినియోగించిన నీటిని లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కింద పరిశుభ్రం చేసి పొలాలకు పంపుతాం. లక్షలు, కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కార్లలో వచ్చి చెత్తను రోడ్లపై వేస్తారు. మనం పీల్చే గాలి బయటనుంచే కదా వచ్చేది? దాన్ని కలుషితం చేస్తే పీల్చి అనారోగ్య పాలవుతాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.
అక్టోబర్ 2 నాటికి పేరుకు పోయిన చెత్త తొలగింపు
‘123 మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వేరు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతీ రోజూ 8,899 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. ఇందులో తడి వ్యర్థాలు 5,496 టన్నులు, పొడి వ్యర్థాలు 3,403 టన్నులుగా ఉంది. వీటి తరలింపు, రీయూజ్ సమర్ధంగా జరుగుతోంది. గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేయడంపై పెట్టిన శ్రద్ధ తొలగింపుపై పెట్టలేదు. 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వేసి పోయింది. అక్టోబర్ 2 నాటికి 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తీయిస్తాం. ఈ ఏడాది డిసెంబర్‌కు 100 శాతం చెత్త క్లియర్ చేస్తాం.
గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి
‘చిన్నప్పుడు కరెంటు లేక లాంతర్ వెలుతురులోనే చదువుకున్నాను. నేడు ఇంటిపైనే సోలార్ కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. 20 లక్షల ఇళ్లపై సోలార్ కరెంటు అనుమతించాం. ఇల్లూ, ఆఫీస్, పొలాలు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఒకప్పుడు కరెంటు బొగ్గుతో తయారయ్యేది. నేడు విండ్ కరెంటు వచ్చింది. గ్రీన్ ఎనర్జీపై నేను శ్రద్ధ పెట్టాను. గ్లోబల్ వార్మింగ్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం గ్రీన్ ఎనర్జీనే’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులనూ ఊడ్చేయండి
‘రాజకీయాలు కలుషితమయ్యాయి. నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు. మీ ఇంట్లో చెత్తను ఊడ్చేసినట్లుగానే రాజకీయాల్లో ఉన్న మలినాన్ని కూడా క్లీన్ చేయాలి. నేర రాజకీయాలు మనకు అవసరమా? వాటిని అడ్డుకోలేమా? ప్రజలు ఆలోచన చేయాలి. 2019 ఎన్నికలకు ముందు నేను మోసపోయాను. సాక్షి అని పత్రిక పెట్టారు. దాంతో చేసేవన్నీ వెధవ పనులే. పేరు మాత్రం సాక్షి. బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడని సాక్షిలో వేశారు. సాయంత్రానికి గొడ్డలిపోటు అని డ్రామాలాడారు. చివరకు నారాసుర చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టి పత్రికలో రాశారు. ప్రజలు అయ్యో పాపం అనుకున్నారు. మళ్లీ మళ్లీ మోసం చేస్తే మనం మోసపోవాలా’ అని సీఎం ప్రశ్నించారు.
చిత్తూరులో పులివెందుల రాజకీయం
ఇటీవల బంగారుపాళ్యం రైతుల దగ్గరకు వచ్చి హడావుడి చేశాడు. మన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే సదుద్ధేశంతో టన్ను మామిడికి టన్నుకు రూ.12 వేలు ఇచ్చేలా చేసింది. ప్రభుత్వం తరపున రూ.4 వేలు, కొనుగోలుదారులు రూ.8 వేలు చెల్లించే ఏర్పాట్లు చేశాం. రైతుల పరామర్శకు వచ్చి రోడ్లపై మామిడి పండ్లు పోసి పులివెందుల రాజకీయం చేశాడు. హత్యా రాజకీయాలు నా జీవితంలో లేవు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని, ప్రజలకు భద్రతకు కల్పించాలని భావించాను. హింసా రాజకీయాలు నా దగ్గర కుదరవు. గత ఐదేళ్లలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఎన్డీఏ వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని అన్నారు.
ప్రాజెక్టులు పూర్తిచేసి రుణం తీర్చుంటా
‘రాయలసీమకు నీళ్లు తెచ్చింది టీడీపీనే. హంద్రినీవా, నగరి, గాలేరు, తెలుగుగంగ ప్రారంభించింది ఎన్టీఆర్ . తెలుగుగంగ ద్వారా తిరుపతికి నీరు అందించాం. తిరుపతిలో గరుడ వారధి నిర్మించి మేమే. వారధిని అలిపిరి వరకూ తీసుకెళ్తే ఆ దుర్మార్గులు మధ్యలో ఆపే ప్రయత్నం చేశారు. అవిలాల చెరువు సుందరీకరణను అడ్డుకున్నారు. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా పనులు చేసి నీళ్లు విడుదల చేశాను. త్వరలో కుప్పం వరకూ నీరు అందిస్తాం. వెంకన్న చెంతకు హంద్రీనీవా నీరు వస్తుంది. మల్లెమడుగు ప్రాజెక్టు, బాలాజీ రిజర్వాయర్ రావాలి. మూలపేట చెరువు, కల్యాణ డ్యామ్‌కు నీళ్లు తీసుకొస్తాం. సోమశిల , స్వర్ణముఖి లింక్ కెనాల్ తీసుకొచ్చి వాటిని బాలాజీ రిజర్వాయర్‌కు కలుపుతాం. వీటిమధ్యలో వేణుగోపాల సాగర్ వస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి నేను పుట్టిన చిత్తూరుజిల్లా రుణం తీర్చుకుంటా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
పేద పిల్లలకు కుటుంబ పెద్దగా ఉంటా
పేదపిల్లలకు కుటుంబ పెద్దలా తాను అండగా ఉంటానని, ఇది దేవుడు తనకు ఇచ్చిన అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక సభలో పీ4 కార్యక్రమంపై సీఎం మాట్లాడారు. ‘రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల పేదకుటుంబాలను పైకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. 2029 నాటికికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ ఆవిష్కృతం కావాలన్నది నా ఆశయం. ఈ పీ4 కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో పీ4 కార్యక్రమం సాకారమవుతుంది. బంగారం లాంటి పిల్లలకు చేయూతనిస్తే వారిలో విశ్వాసం పెరిగి మరో 10 మందికి సాయం చేసే శక్తి వస్తుంది. పిల్లలకు అవకాశం కల్పించే బాధ్యత నాది…పైకొచ్చే బాధ్యత వారిది. ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదు. నిన్ననే 40 మంది పారిశ్రామిక వేత్తలో సమావేశమయ్యాను. వారు వేల కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
బంగారు కుటుంబానికి ఎంపికైన డి.వినూత మాట్లాడుతూ…
నేను ఇంటర్ బైపీపీలో 986 మార్కులు సాధించాను. ప్రస్తుతం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. నా చెల్లి అనిత ఇంటర్ పూర్తి చేసింది. నా తమ్ముడు గణేష్ 10వ తరగతి చదవుతున్నారు. మా అమ్మను 2014లో, నాన్నను కరోనా సమయంలో కోల్పోయాం. నాయనమ్మ, తాతయ్య సహకారంతో చదువుకుటుంటున్నాం. నేను మెడిసిన్, నా చెల్లి, తమ్ముడు సివిల్స్ చదవాలన్నది కోరిక. మాకు దారి చూపిస్తే చదువుకుని మంచిస్థాయికి వెళ్లి మరో మార్గదర్శిగా మారతాం.
రోటరీక్లబ్ ప్రెసిడెంట్ రాజేంద్ర శెట్టి మాట్లాడుతూ…. వెంకటేశ్వరస్వామి ఇచ్చిన వరం సీఎం చంద్రబాబు. పీ4 కార్యక్రమాన్ని మంచి విజన్‌తో చంద్రబాబు రూపొందించారు. ఈ పీ4 ద్వారా ఏపీ మోడల్ స్టేట్‌లా మారుతుంది. రోటరీ క్లబ్ తరపున వినూతను, ఆమె చెల్లి, తమ్ముడు చదువు బాధ్యతలను తీసుకుంటాం.
ఈశ్వరి, బంగారు కుటుంబం
2019లో నా భర్త చనిపోయారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అత్తింటి వారు సహకరించడం లేదు. పెద్ద కుమారుడు 8, చిన్న కుమారుడు 5వ తరగతి చదువుతున్నారు. నా పిల్లలకు మంచి విద్యను అందించాలని కోరుతున్నాను.
శ్రీనివాస్, రాస్ విజ్ఞానకేంద్రం సీనియర్ శాస్త్రవేత్త
ఈశ్వరికి మా సంస్థ ద్వారా బ్యూటిషియన్ కోర్సు అందించి ఆర్థికంగా బలపడేందుకు అవకాశం కల్పిస్తాం. ఆమె ఇద్దరు పిల్లలను మా సంస్థ ద్వారా చదివిస్తాం.