మంగళగిరి నియోజకర్గ అభివృద్ధి పనులపై మంత్రి లోకేష్ సమీక్ష

4
0

మంగళగిరిలో మరో 2వేలమందికి త్వరలో ఇళ్లపట్టాలు!

మంగళగిరిలో ఇళ్లులేని పేదలకు టిడ్కోఇళ్లకు ప్రణాళికలు

మహానాడు రిటైనింగ్ వాల్ తోపాటు పార్కు నిర్మాణం

త్వరలోనే సమీకృత అండర్ గ్రౌండ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు

మంగళగిరి నియోజకర్గ అభివృద్ధి పనులపై మంత్రి లోకేష్ సమీక్ష

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2వేలమంది ఆగస్టునెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… గతంలో 3వేలమందికి సుమారు వెయ్యికోట్ల విలువైన ఇళ్లపట్టాలు అందజేశామని, ఆగస్టులో మరో 2వేలు పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం కొత్తగా టిడ్కో గృహ సముదాయాల స్థలసేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని ప్రస్తుత టిడ్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధికి చర్య తీసుకోవాలని సూచించారు. ఎంటిఎంసి పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజి, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్, ప్రభుత్వ నిధులతో నిర్మించ తలపెట్టిన 31 కమ్యూనిటీ హాళ్లు, 26పార్కులు, శ్మశానాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎడ్వంచర్ పార్కుగా ఎకో పార్కు అభివృద్ధి

వరద నివారణకు మహానాడు కాలనీ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులతో పాటే సమాంతరంగా సుందరమైన పార్కును కూడా అభివృద్ధి చేయండి. మంగళగిరి శివాలయం పక్కన అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మోడల్ లైబ్రరీ పనులు తుదిదశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిడమర్రు మోడల్ పునర్మిర్మాణ పనులను సెప్టెంబర్ లోగా పూర్తిచేయండి. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బృహత్ ప్రణాళిక వేగవంతంగా పూర్తిచేసి త్వరలో పనులు ప్రారంభించండి. మంగళగిరిలో స్మార్ట్ స్ట్రీట్ బజార్, నిడమర్రు రోడ్డులో 350 షాపులతో అధునాతన కూరగాయలు, పూలు, పండ్ల మార్కెట్, పోలకంపాడు వద్ద రూ.2కోట్లతో చేపల మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోండి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు వస్తున్నందున మంగళగిరి ఎకో పార్కును ఎడ్వంచర్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో గుంతలు లేని రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్, నూరుశాతం వీధిలైట్లుపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు, నియోజకవర్గ పరిధిలో చెరువుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ చర్చించారు. ఈ సమావేశంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హలీమ్ బాషా, ఎండోమెంట్స్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎంటిఎంసి ఎస్ఇ శ్రీనివాసరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ అశోక్, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here