మెగాస్టార్‌కే షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. హైకోర్టుకు వివాదం!
మెగాస్టార్ చిరంజీవి అంటే.. సమాజంలో మంచి పేరు, పలుకుబడి ఉందనడంలో సందేహం లేదు. పైగా వినమ్రుడు, వివాదరహితుడు కూడా. దీంతో ఆయన ఏం చెప్పినా.. ఏం చేయాలని అనుకున్నా..పనులు క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, చిత్రంగా.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం మెగాస్టార్‌కే షాకిచ్చారు. ‘అయితే ఏంటి?’ అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో చిరు.. హైకోర్టు వరకు వెళ్లి.. అధికారులను కదిలించారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చిరంజీవికి సొంత నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం లో 2000 సంవత్సరంలో సీఎంగా ఉన్న చంద్రబాబును కలిసి.. ఇంటికి సంబంధించిన అనుమతులు తెచ్చుకున్నారు. జీ+2 ఇల్లు కట్టుకున్నారు. అయితే.. దీనిని రెనోవేషన్ చేసుకోవాలని నిర్ణయించారు. దాదాపు పదిహేను సంవత్సరాలు అయిన నేపథ్యంలో రిటైనింగ్ వాల్‌తో పాటు.. మరికొన్ని నిర్మాణాలను కూడా చేపట్టాలని భావించారు.
అయితే.. ఎక్కడ ఏం చేసినా.. ఇప్పుడు హైడ్రా దూకుడుగా ఉన్న నేపథ్యంలో అనుమతులు తీసుకునేందుకు చిరంజీవి గత నెల 5న జీహెచ్ ఎంసీకి .. సదరు మార్పులకు సంబంధించి వివరిస్తూ.. అనుమతులు కోరారు. ఈ మేరకు ఆయన దరఖాస్తు చేసుకుని.. దాదాపు నెల రోజులు గడిచిపోయాయి. కానీ, అనుమతులు మాత్రం రాలేదు. దీంతో అధికారులకు ఫోన్లు చేసినా స్పందించలేదట. ఇక, విధిలేని పరిస్థితిలో మెగాస్టార్.. హైకోర్టును ఆశ్రయించారు.
ఇలా.. తన ఇంటిని రెనోవేషన్ చేసుకోవాలని భావించానని.. అయినా.. అధికారులు తనకు అనుమతులు ఇవ్వడం లేదని.. కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకుని.. చట్ట ప్రకారం అనుమతులు ఇప్పించాలని అభ్యర్థించారు. దీనిని తాజాగా మంగళవారం విచారించిన కోర్టు.. జీహెచ్ఎంసీ అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని.. సక్రమ నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వలేరా? అని నిలదీసింది. సాధ్యమైనంత త్వరగా.. చిరంజీవి ఇంటి రెనోవేషన్ పనులకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది.