జగన్మాత దుర్గ‌మ్మ సన్నిధిలో శాస్త్రోక్త‌కంగా గణపతి హోమం

2
0

జగన్మాత దుర్గ‌మ్మ సన్నిధిలో శాస్త్రోక్త‌కంగా గణపతి హోమం

ఇంద్ర‌కీలాద్రి:- ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ఇంద్ర‌కీలాద్రిపై జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో గ‌ణ‌ప‌తి హోమాన్ని సోమ‌వారం శాస్త్రోక్త‌కంగా నిర్వ‌హించారు. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి ‬పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధుల్లో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వల్ల జాతకంలోని సమస్యలు తొలగి, అన్ని పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పురాణోక్తి. ఆది పరాశక్తి, జగన్మాత కనకదుర్గమ్మ సన్నిధిలో వేంచేసిన విఘ్నాధిపతి అయిన గణపతిని సంకటహర చతుర్థి సందర్బంగా భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజ, హోమాల‌ను మంత్ర పూర్వకంగా అర్చకులు జరిపించారు. ఆలయ ఈవో వి.కె.శీనానాయక్ హోమం, అభిషేకం పూజల్లో పాల్గొన్నారు. స్థానాచార్య వి.శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు.

దుర్గ‌మ్మ సేవ‌లో చాగంటి కోటేశ్వ‌ర‌రావు దంప‌తులు..

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంప‌తులు సోమ‌వారం ఉద‌యం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. వారికి దుర్గ‌గుడి ఈవో శీనా నాయక్ స్వాగతం పలికి ఆలయ మ‌ర్యాదలతో అమ్మవారి దర్శనం క‌ల్పించారు. అనంత‌రం వేద పండితుల ఆశీర్వ‌చ‌నం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అంద‌జేశారు.

నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి విరాళాలు

ఇంద్ర‌కీలాద్రిపై అమల‌వుతున్న నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి కానూరు తాడిగడప ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు కరిపినేని శివరామకృష్ణారావు కుటుంబీకులు కరిపినేని నాగేశ్వరరావు రూ.1,11,116లు విరాళాన్ని ఆల‌య ఈవో శీనా నాయ‌క్‌కు సోమ‌వారం అంద‌జేశారు. అదేవిధంగా నవీన్ కుమార్ ఘట్టమనేని త‌న తల్లిదండ్రులు రాజగోపాల్, రుసూద్ర పేరిట రూ.1,20,000 నిత్యాన్నదాన పథకానికి విరాళంగా ఆల‌య ఈవోకు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా దాత‌లు వారి కుటుంబ స‌భ్యుల‌కు అధికారులు అమ్మ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించి వేద పండితుల ఆశీర్వ‌చ‌నం ఏర్పాటు చేశారు. అనంత‌రం అమ్మ‌వారి చిత్ర‌ప‌టం, ప్ర‌సాదాలు అంద‌జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here