రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు : యార్లగడ్డ
విజయవాడ :
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రోడ్ల మండలం ఉన్న గ్రామంలో గురువారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పోలీస్ శాఖలను నియమకాలు చేపట్టినట్లు చెప్పారు. అంతే కాకుండా పారిశ్రామిక రంగంలో ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 70 సంవత్సరాలు వయసులో కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలందరూ సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజాక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్రణం హరి బాబు మండల పార్టీ అధ్యక్షుడు గొడ్డల చిన్న రామారావు, గూడవల్లి నరసయ్య, సర్నాల బాలాజీ, కోనేరు సందీప్ , మేడేపల్లి రామ, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాస్ రెడ్డి, లక్కా రెడ్డి కోటిరెడ్డి, మధు శివరాంప్రసాద్,గంప శ్రీనివాస్ యాదవ్, బాల శేఖర్ రెడ్డి,చల్లగాలి సునీల్, సుదీప్ రెడ్డి బేతపూడి మురళీకృష్ణ, ఆరేపల్లి తరుణ్, మధు మహేశ్వరరావు, తెలుగు యువత నాయకులు పరుచూరి నరేష్, కొసరాజు సాయి రామ్, తదితరులు పాల్గొన్నారు