సమ్మె సంపూర్ణంకదం తొక్కిన కార్మిక వర్గంవేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ
విజయవాడ: రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడలో కార్మికుల సమ్మె విజయవంతమైంది. తమ విధులను బహిష్కరించి సమ్మెలో వేలాదిగా కార్మిక వర్గం పాల్గొన్నారు. రైల్వే, బ్యాంకు, ఎల్ఐసి, వివిధ సంఘటిత, అసంఘటితరంగాల కార్మికులు వేలాదిగా సమ్మెలో పాల్గొన్నారు. విజయవాడ వన్ టౌన్ రధం సెంటర్ నుంచి లోబ్రిడ్జి మీదుగా, ఏలూరు రోడ్డు మీదుగా, లెనిన్ సెంటర్ కు ప్రదర్శనగా చేరుకున్నారు. ప్రదర్శనలో నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, నూతన వ్యవసాయం మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్మిక, కర్షక ఐక్యత వర్ధిల్లాలంటూ పెద్దపెట్టున నినదించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం లెనిన్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం మాట్లాడారు. ఈ సమ్మె కేవలం కొసమెరుపు మాత్రమేనన్నారు. రానున్న రోజుల్లో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సి ఉందన్నారు. లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు, కార్మిక చట్టాలు అమలయ్యే వరకు పోరాటం ఆగేది లేదన్నారు. బడా కార్పొరేట్ కంపెనీల కోసం వారికి అనుకూల చట్టాలను రూపొందిస్తున్నారని, కంపెనీల దోపిడీకి ద్వారాలు బార్లా తెరిచారని విమర్శించారు. కార్మికుల, కర్షకుల సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేసారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని దుయ్యబెట్టారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల పాలన కోసమా? కంపెనీల శ్రేయస్సు కోసమా! అని ప్రశ్నించారు. పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయని ప్రశ్నించారు. విశాల పేద ప్రజానీకాన్ని కూడగట్టుకొని సంఘటిత ఐక్య పోరాటాలు చేయటమే పరిష్కార మార్గమని నాయకులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో సమరశీల ఉద్యమాల కోసం అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఎటువంటి ప్రాణత్యాగాలకైనా సిద్ధపడాలని కార్మిక వర్గాన్ని కోరారు. ఈ బహిరంగ సభలో మాజీ మంత్రి, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్రనాథ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్, ఏఐయుటియుసి కే సుధీర్, ఏఐఎఫ్ టియు(న్యూ) జాస్తి కిషోర్ బాబు, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఏఐసీసీటుయు రాష్ట్ర నాయకులు ఉదయ్ కిరణ్, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, వైయస్సార్ టియు రాష్ట్ర అధ్యక్షులు కోనేరు గౌతంరెడ్డి, బ్యాంకు అసోసియేషన్ నాయకులు అజయ్, హెచ్ఎంఎస్ నాయకులు త్రినాథ్, జర్నలిస్ట్ నాయకులు ఎస్ వెంకటరావు, రైతు సంఘం నాయకులు వై కేశవరావు, యం.వెంకటరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ బహిరంగ సభకు ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కే దుర్గారావు అధ్యక్షులుగా వహించారు. ఈ వేలాది మంది భారీ ప్రదర్శనకు అన్ని రంగాల కార్మిక సంఘాల అనుబంధ యూనియన్లు, రైతు, కూలీ, కౌలు రైతు, ముఠా, ఆశ, అంగన్వాడీ, బ్యాంక్, ఇన్య్సూరెన్స్, రైల్వే, స్కీమ్ వర్క్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్, మార్కెట్ సెంటర్, రైల్వే లో బిడ్జ్, బస్టాండ్, ఏలూరు రోడ్, లెనిన్ సెంటర్లో ట్రాఫిక్ అంతరాయం జరిగింది. పోలీసులు వాహనాల్ని ట్రాఫిక్ ని పక్కకు మళ్ళీంచారు. ఈ సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. నగర పోలీస్ అధికారులు ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.