పండుగ వాతావరణంలో మెగా పిటిఎం నిర్వహించండి ఉన్నత విద్య, పాఠశాల విద్య ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష

2
0

పండుగ వాతావరణంలో మెగా పిటిఎం నిర్వహించండి

డిగ్రీలో విద్యార్థులపై భారం తగ్గేలా సబ్జెక్టుల ఎంపిక విధానం

రాష్ట్రంలో కొత్త వర్సిటీల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు

గిరిజన ప్రాంతాల్లో నూతన స్కూలు భవనాల నిర్మాణానికి చర్యలు

ఉన్నత విద్య, పాఠశాల విద్య ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10వతేదీన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించే మెగా పిటిఎం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరినీ మెగా పిటిఎంలో భాగస్వాములను చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో ఎకో క్లబ్ లను ఏర్పాటు చేసి, మొక్కల పెంపకంపై విద్యార్థులను చైతన్యపర్చి, పరిరక్షించేలా ప్రతి విద్యార్థికి గ్రీన్ పాస్ పోర్టు అందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లలో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటు, భవిత సెంటర్ల మరమ్మతులకు చర్యలు తీసుకోండి. అగస్త్య ఫౌండేషన్ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 5 అధునాతన రీజనల్ సైన్స్ సెంటర్లను విద్యార్థులకు ఉపకరించేలా హబ్ అండ్ స్పోక్ మోడల్ లో నిర్వహించండి. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్, ఒకేషనల్ విద్య, వ్యక్తిగత భద్రతపై శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టండి.

విద్యాప్రమాణాల మెరుగుదలకు కృషిచేయండి

గిరిజన ప్రాంతాల్లోని మారుమూల స్కూళ్లకు మొబైల్ నెట్ వర్క్ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు స్కూళ్లకు చేరుకునే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసి, అవసరమైన చోట నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వతరగతి వరకు అడ్మిషన్ల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కేంద్రం విడుదల చేసిన పరాక్ రాష్టీయ సర్వేక్షన్ – 2024 (నాస్) లోని అంశాలను పరిశీలించి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుదలకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టండి. వైసిపికి చెందిన వారు 32 కేసులు వేసినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగా డిఎస్సీని నిర్వహించిన తీరుపై మంత్రి సమీక్షించారు. ఆగస్టు నాటికి ఎంపికైన టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైస్కూలు ప్లస్ స్కూళ్లలో అధ్యాపకుల నియామకంపై చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు.

డిగ్రీ సబ్జెక్ట్ ల ఎంపికపై విద్యార్థులకు భారం తగ్గేలా చర్యలు

ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ… డిగ్రీ విద్యార్థుల సబ్జెక్టుల ఎంపికకు సంబంధించి ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు, దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ను సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విద్యార్థులపై భారం తగ్గేవిధంగా యుజిసి నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. డిగ్రీ అడ్మిషన్లపై మంత్రి సమీక్షిస్తూ… విద్యార్థులతోపాటు కళాశాలలకు కూడా ఆన్ లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించాలని సూచించారు. కళాశాలలు భర్తీచేసే సందర్భంలో విద్యార్థుల అంగీకారాన్ని ఆధార్ అథెంటికేషన్ తో అనుసంధానించాలని సూచించారు. నిర్ణీత కటాఫ్ తేదీ తర్వాత ప్రతిభ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లు కేటాయించాలని అన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

ఆర్ జెయుకెటిల్లో కంప్యూటర్ ల్యాబ్ లకు చర్యలు

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చే యూనిఫైడ్ యాక్ట్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో జాయింట్ సర్టిఫికేషన్ విధివిధానాలపై చర్చించారు. నిర్ణీత క్యాలెండర్ ప్రకారం అన్ని సెట్ లను పూర్తిచేసి, సకాలంలో అడ్మిషన్లు పూర్తిచేయాలని అన్నారు. ఆర్ జెయు కెటిల్లో అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో నూతన యూనివర్సిటీల పురోగతిపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో వర్సిటీల ఏర్పాటుకు ముందుకువచ్చిన యాజమాన్యాలతో మాట్లాడాలని, యూనివర్సిటీల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యాశాఖ డైరక్టర్ నారాయణ్ భరత్ గుప్త, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here