ఎన్టీఆర్ జిల్లా, జులై 04, 2025
నాటుసారా నిర్మూలనతో సమాజానికి నవోదయం
- ప్రత్యేక సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించండి
- గంజాయి వంటి మాదకద్రవ్యాలపైనా ఉక్కుపాదం మోపండి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రజల్లో అవగాహన కలిగించి రాష్ట్రంలో నాటుసారాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవోదయం కార్యక్రమాన్ని ప్రారంభించిందని.. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి సమష్టి కృషితో నాటుసారా రహిత జిల్లా, రాష్ట్రం కోసం తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. నవోదంయ 2.0 ద్వారా చేపడుతున్న జన జాగృతి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ నవోదయం సత్ఫలితాలు ఇచ్చిందని, ఇదే స్ఫూర్తితో నవోదయం 2.0ను ప్రారంభించడం జరిగిందని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజా భాగస్వామ్యంతో కృషిచేయాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలు కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నాయని.. ఈ కమిటీల సహకారంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు దిశగా నడిపించాలని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా ఎ.కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం, రెడ్డిగూడెం మండలాల పరిధిలోని 26 గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఈగెల్ భాగస్వామ్యంతో గంజాయి వంటి మాదకద్రవ్యాలపైనా ఉక్కుపాదం మోపాలని.. ఎక్కడైనా వీటి ఆనవాళ్లు కనిపిస్తే 14405 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయొచ్చన్నారు. నాటుసారా, మాదక ద్రవ్యాలు వంటి వాటివల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతాయనే దానిపై అవగాహన కల్పించాలని.. ప్రతి విద్యా సంస్థలో ఈగెల్ క్లబ్స్ క్రియాశీలంగా పనిచేసేలా సమన్వయ శాఖలతో కలిసి పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్రైజ్ ఆఫీసర్ ఆర్వీ రామశివ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు ఆర్బీ పెద్దిరాజు, జె.రమేష్, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ వీవీఎస్ఎన్ వర్మ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంజే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.