మన్యం వీరుడు అల్లూరి పోరాట పటిమ స్ఫూర్తిదాయకం.జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

0
0

ఎన్‌టిఆర్‌ జిల్ల తేది: 04.07.2025

            మన్యం వీరుడు అల్లూరి పోరాట పటిమ స్ఫూర్తిదాయకం.జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

    రవి అస్తమించని  బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ నేటి తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ 

 మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌  మాట్లాడుతూ బ్రిటీషు పాలనలో తెల్ల దొరలు గిరిజనుల శరీరకంగా మానసికంగా హింసిస్తూ వారి శ్రమను, అటవి సంపదను దోచుకుని అటవిక పరిపాలన సాగిస్తున్న నేపధ్యంలో అల్లూరి సీతారామరాజు ప్రాణాలను సైత్యం పణంగా పెట్టి బ్రిటీషు అధికారులకు ఎదురునిలిచి పోరాడిన తీరును నేటి తరం స్పూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. మన్యం ప్రజలలో  చైతన్యం, తీసుకువచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా బ్రిటీషు వారిపై ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తి మార్గంలో పైనిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను దగ్గరగా గమనించి, తెల్లదొరల దమన రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి సీతారామ రాజు ప్రజల్లో చైతన్యం నింపి, వారికి ధైర్యసాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారన్నారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అన్నారు. ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అని తెలిపారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొని వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయిందని కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. 

    కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహాం, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ఎస్‌. శ్రీనివాసరెడ్డి,  సూపరింటెండెంట్‌ సిహెచ్‌ .దుర్గాప్రసాద్‌,  జిల్లా వ్యవసాయ అధికారిణి డి.ఎంఎఫ్‌ విజయకుమారి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్‌. వి. మోహన్‌రావు, డివిజనల్‌ పిఆర్‌వో కె. రవి కలెక్టరెేట్‌ సిబ్బంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here