ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రూట్ మ్యాప్ ప్రకటించాలి
తక్షణమే పి ఆర్ సి కమిషనర్ నియామకం చేపట్టాలి.
పెండింగ్ డిఎలను సత్వరమే చెల్లించండి
ఉద్యోగుల అసంతృప్తి అర్థం చేసుకోండి.
ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలి.
ఏపీ ఎన్జీజిఓ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్
విజయవాడ :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర పురోభివృద్ధి కోసం తలపెట్టిన పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీజీవో జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నూతన చైర్మన్ గా
ఏకగ్రీవంగా విద్యాసాగర్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా డి వి రమణ ఎన్నిక జరిగింది. ఎన్నిక అనంతరం గురువారం గాంధీ నగర్ లోని ఎన్జీజిఓ హోమ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకగ్రీవంగా తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన ఏపీటీఎఫ్, ఏపీ యుటిఎఫ్, ఏపీఎస్ఆర్టీసీ, ఎస్ టి యు, పి ఆర్ టి యు, పెన్షనర్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, CPS ఉద్యోగుల సంఘం, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం, ఇంజనీర్ల సంఘం సహా ఇతర సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా వివిధ రూపాల్లో నష్టపోయిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలలో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికామన్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను నిర్ణీత
వ్యవధిలో పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన ప్రభుత్వానికి ఏడాది కాలం సమయం ఇచ్చామని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వ మాత్రం ఉద్యోగుల సమస్యలపై నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తోందన్నారు. గత ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులకు 27 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని, గత సంవత్సర కాలంలో నూతన ప్రభుత్వం 7500 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లించిందన్నారు. ఇప్పటికీ మూడు డిఏలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని జూలై లో నాల్గవ డి ఏ ప్రకటించాల్సి ఉందన్నారు.కేవలం వైద్య, ఉపాధ్యాయ రంగాలలో ఉన్న పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలోని కీలకమైన రంగాలలో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, మొత్తం వాటిని భర్తీ చేయనప్పటికీ ఎంత పని ఒత్తిడిలో నైనా సరే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన సమస్యలను మరొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ప్రధానంగా నూతన పిఆర్సి కమిషనర్ నియామకం, DA ల మంజూరు, సరెండర్ లీవ్ ల చెల్లింపు, పెన్షనర్లకు గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని పూరిస్తూ క్వాంటం పెన్షన్ విధానంలో మార్పులు, ఉద్యోగుల ఆరోగ్య సేవల కోసం ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న నిధులను సరాసరి ఆసుపత్రుల ఖాతాకు జమ చేసేలా మార్పులు చేయటం, సరెండర్ లీవుల చెల్లింపు వంటి ముఖ్యమైన సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై సంప్రదింపులకు, ఆర్థిక ఆర్థికేతర విషయాలను చర్చించేందుకు ప్రభుత్వంలో ఒక కీలక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల విషయంలో ప్రభుత్వ0 దృష్టి సారించుకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ నెలలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని చీఫ్ సెక్రటరీ ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారన్నారు. ఏపీ జెఎసి సెక్రెటరీ జనరల్ కే ఎస్ ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ కు ముందు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి ఓపిఎస్ విధానం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధానం దేశంలోని ప్రధాన రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. 2014కు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన విధానాలను కొనసాగించి 7వేల అంది కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ అమలు చేయాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలలో పారదర్శకత పాటించాలన్నారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు.
గత ప్రభుత్వం పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచిందని, కానీ ఈ అవకాశం సహకార, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు వర్తింప చేయలేదన్నారు. వీరికి కూడా 62 సంవత్సరాలకు పదవి విరమణ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా సమయంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పంచాయతీరాజ్ శాఖలో మాత్రం ఈ విధానం అమలు కాలేదని గుర్తు చేశారు. ఈ శాఖలో కూడా క్రమ పద్ధతిలో కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించకపోతే ఉద్యోగ సంఘాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో
ఏపీఎన్జిజీవో ప్రధాన కార్యదర్శి డి.వి రమణ, జేఏసీ సంఘాల నేతలు రఘునాథరెడ్డి (ఎస్ టి యు), వై. శ్రీనివాసరావు (ఏపీ పిటిడి, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్), బండి శ్రీనివాసరావు (ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్), జి. హృదయ రాజు (ఏపీటీఎఫ్1938), ఎన్. చంద్రశేఖర్ (నాలుగవ తరగతి ఉద్యోగుల రాష్ట్ర సంఘం), పివి సాయికుమార్ (ఏపీ అగ్రికల్చరల్ ఎంప్లాయిస్ అసోసియేషన్), కే. రవీంద్ర (ఏపీ పంచాయతీ రాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్), సిహెచ్ శ్రీనివాసరావు (ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జీవోస్ అసోసియేషన్), డి. వెంకటేశ్వర్లు (రాష్ట్ర పెన్షనర్ల సంఘం), ఏ. సాంబశివరావు (ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్), సిహెచ్. మంజుల (ఏపీటీఎఫ్ 257), పాము శ్రీనివాసరావు (రాష్ట్ర ఖజానా ఉద్యోగుల సంఘం), వైవిడి. ప్రసాద్ (ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్), ఆర్ఎస్. హరనాథ్ (పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ ఎంప్లాయిస్ అసోసియేషన్), బి. జానకి, (ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), వేణు మాధవరావు (ఏపీ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్), టి. కృష్ణ కిషోర్ (ఏపీ ఐటిఐ అండ్ డి ఎల్ టి సి స్టాఫ్ అసోసియేషన్), బి. నరసింహులు (ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్), ఎస్. విద్య (మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం), బి. సేవా నాయక్ (ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీస్ ఫెడరేషన్), షేక్ మహమ్మద్ జానీ పాషా (గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం), ఎ. రంగారావు (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), బి. వెంకటేష్ బాబు (వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం), ఎస్.ఎల్. సోమయాజులు (ఏపీ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్), వి. కృష్ణ (ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం), కె. ప్రకాశరావు (ఏపీ ప్రైమరీ టీచర్స్) తదితరులతో సహా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.