అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం : యార్లగడ్డ
గన్నవరం :
కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామంలో మంగళవారం ఉదయం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంతకు ముందు రెండు నెలల పింఛన్ బ్యాలెన్స్‌ను కూడా కలిపి ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం లో 163, గన్నవరం మండలంలో 132, ఉంగుటూరు మండలంలో 113 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయని వివరించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. గత పాలకుల అనాలోచిత చర్యల ఫలితంగా అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాడిలో పెడుతున్నారని ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ప్రారంభిందని వివరించారు. పరిశ్రమలు ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చన్న ఆయన గన్నవరం నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు ఉపందుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ త్వరలో నెరవేరనుందని యార్లగడ్డ తెలిపారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్న యార్లగడ్డ వాటిని పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వర్ణలత, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, గ్రామ టిడిపి పార్టీ ప్రెసిడెంట్ బెనర్జీ పార్టీ నాయకులు పిన్నిబోయిన వెంకటేశ్వరరావు తొలిమెల్లి సుబ్రహ్మణ్యం కాటూరి అప్పారావు వీర్ల రాంబాబు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పరుచూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.