యోగాతో సంతాన సాఫ‌ల్య యోగం.! యోగాకు సంతాన లేమి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే అద్భుత శ‌క్తి

4
0

ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 27, 2025

యోగాతో సంతాన సాఫ‌ల్య యోగం..!

  • యోగాకు సంతాన లేమి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే అద్భుత శ‌క్తి
  • యోగాను జీవన విధానంలో భాగము చేసుకునేలా ప్రోత్సహించాలి.
  • స‌రోగ‌సీ చట్టం కింద కొత్త‌గా రెండు ద‌ర‌ఖాస్తుల‌కు ఆమోదం
  • పీసీ-పీఎన్‌డీటీ చ‌ట్టాన్నిఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

మారుతున్న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు వంటివాటివ‌ల్ల చాలా జంట‌లు సంతాన లేమి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో సంతాన సాఫ‌ల్య సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌రిచే అద్భుత శ‌క్తి యోగాకు ఉంద‌ని, ఈ విష‌యంపై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో గ‌ర్బ‌స్థ పిండ లింగ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల నిషేధ చ‌ట్టం-1994, జిల్లా స‌హాయ‌క పున‌రుత్ప‌త్తి సాంకేతిక‌త‌, అద్దె గ‌ర్భం చ‌ట్టం అథారిటీ క‌మిటీల స‌మావేశం జ‌రిగింది. క‌మిటీ స‌భ్యులు, సెకండ్ అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ జ‌డ్జ్ క‌మ్ మెట్రోపాలిట‌న్ సెష‌న్స్ జ‌డ్జ్ ఎ.స‌త్యానంద్ హాజరైన స‌మావేశంలో క‌మిటీ ఛైర్మ‌న్‌, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఒత్తిడితో పాటు హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి ప‌రిస్థితులు సంతాన లేమి స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో క్ర‌మ‌శిక్ష‌ణాయుత యోగాచ‌ర‌ణ సంతాన సామ‌ర్థ్యాన్ని పెంచుతుంద‌ని.. వైద్యుల చికిత్స‌కు నిపుణులు సూచించిన ప్ర‌త్యేక యోగా వ్యాయామం తోడైతే మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని, జీవ‌న విధానంలో యోగాను భాగం చేసుకునేలా ప్రోత్స‌హించాల‌ని సూచించారు.
ప్ర‌త్యేక బృందాల‌తో స్కానింగ్ కేంద్రాల్లో విస్తృత త‌నిఖీలు:
జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వ‌స్తే వాటిని త్వ‌రిత‌గ‌తిన విచారించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గ‌ర్భ‌స్థ పిండ లింగ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చ‌ట్ట‌రీత్యా నేర‌మ‌ని.. చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న పెంపొందించేలా ఆసుప‌త్రుల్లో పోస్ట‌ర్లు, బోర్డులు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌ద‌ర్శించేలా చూడాల‌ని ఆదేశించారు. జిల్లాలో ఉన్న 306 అల్ట్రా సౌండ్ స్కాన్ కేంద్రాల్లో ప్ర‌త్యేక బృందాల‌తో త‌నిఖీలు చేసి నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లాలో అవ‌స‌ర‌మైన వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌స్తుతమున్న స్కానింగ్ కేంద్రాల‌కు అద‌నంగా కొత్త రిజిస్ట్రేష‌న్ల‌కు సంబంధించిన రెండు ద‌ర‌ఖాస్తుల‌ను, రిజిస్ట‌ర్డ్ స‌ర్టిఫికేట్ల‌లో మార్పుల‌కు సంబంధించి 11 ద‌ర‌ఖాస్తుల‌ను క‌మిటీ ప‌రిశీలించి, చ‌ర్చించి, ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏఆర్‌టీ లెవెల్‌-1 కేట‌గిరీకి సంబంధించిన మూడు ద‌ర‌ఖాస్తులు, స‌రోగ‌సీ ప్రొసీజ‌ర్‌కు సంబంధించి రెండు ద‌ర‌ఖాస్తుల‌కు క‌మిటీ ఆమోదం తెలిపింది. పీసీ – పీఎన్‌డీటీ చ‌ట్టం వివ‌రాలను స‌రైన విధంగా ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డం, నివేదిక‌లను స‌రిగా పంప‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో రెండు ఆసుప‌త్రుల‌కు రూ. 25 వేల చొప్పున జ‌రిమానా విధింపున‌కు క‌మిటీ ఆమోదం తెలిపింది.
స‌మావేశంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్చంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ప్రోగ్రామ్ ఆఫీస‌ర్ డా. పి.న‌వీన్‌, ఐవీఎఫ్ స్పెష‌లిస్ట్ డా. ప‌ద్మ‌జ‌, లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్ వాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here