ఉద్యోగుల పక్షపాతి సీఎం చంద్రబాబు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఉద్యోగుల సమస్యలతో పాటు గురుకులాలు, బీసీ కార్పొరేషన్లలో ఉద్యోగుల సమస్యలను మంత్రి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను ఎంతో వేదనకు గురి చేసిందన్నారు. హక్కులు గళమెత్తిన ఉద్యోగులపై కేసులు బనాయించి, వేధింపులకు, బెదిరింపులకు గురిచేసిందన్నారు. చివరికి జీతాలు సైతం సరిగ్గా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును సైతం దారిమళ్లించిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు కీలకమని గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై బనాయించిన అక్రమ కేసులను తొలగించడంతో పాటు బీసీ గురుకులాలతో పాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఉద్యోగుల పక్షపాతి సీఎం చంద్రబాబు అని అన్నారు. అంతకు ముందు మంత్రి సవితను ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.