ఎన్టీఆర్ జిల్లా, జూన్ 24, 2025
డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చుదిద్దుతాం
- పైలట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ జిల్లా ఎంపిక
- క్లస్టర్ విధానం అమలుకు జిల్లాలో శ్రీకారం
- అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతా దినోత్సవం రోజున ప్రారంభోత్సవం
- ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా వినూత్న విధానం
- రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్
రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ అన్నారు.
డంపింగ్ యార్డ్ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దే లక్ష్యంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), కొలికపూడి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మునిసిపల్ కమిషనర్లతో
నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్మెంట్)లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే తొలి జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను డంపింగ్ యార్డ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్లస్టర్ విధానం అమలుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో రెండు క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ మినహా జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి పట్టణ స్థానిక సంస్థలతో పాటు ఐదు వేలకు పైబడి ఉన్న దాదాపు 75 ప్రధాన గ్రామపంచాయతీలను గుర్తించి రెండు క్లస్టర్లుగా విభజించి ఏ రోజుకారోజుకే వ్యర్థాల ప్రాసెస్ అయ్యే విధంగా మోడల్ రూపొందించామన్నారు. జగ్గయ్యపేట, నందిగామ, కొండపల్లి నగర పంచాయితీలు వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు, తిరువూరు, మైలవరంతో పాటు పక్కనున్న నూజివీడుకూడా కవరయ్యేలా క్లస్టర్లను రూపొందించడం జరిగిందన్నారు. అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛతా దినోత్సవం రోజున తొలి క్లస్టర్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని, అందులో భాగంగా జిల్లాను డంపింగ్‌యార్డ్ రహిత జిల్లాగా చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నామన్నారు. ఇందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ అన్నారు.
సమావేశంలో జగ్గయ్యపేట మునిసిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ డీటీవీ కృష్ణారావు, తిరువూరు ఛైర్పర్సన్ కె.నిర్మల, కమిషనర్ కె.మనోజ్, కొండపల్లి ఛైర్పర్సన్ సీహెచ్ చిట్టిబాబు, కమిషనర్ రమ్యకీర్తన, నందిగామ ఛైర్పర్సన్ మహాలక్ష్మి, కమిషనర్ నూకరాజు, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.