విజయవాడ, తేదీ: 11.06.2025 అమెరికా ఆంక్షల వల్ల ఆక్వా రంగంలో సంక్షోభం మొన్నటి వరకు ఆక్వా ఎగుమతుల పై సందిగ్ధం రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు దేశీయ రొయ్యల ఎగుమతుల వాడకాన్ని ప్రోత్సహిద్దాం రొయ్యల పెంపకం దారులు ఎక్కువ… తినేవారు తక్కువ, దీన్ని పెంచాలి ఆక్వా కు రూ. 1.50 పైసలకే విద్యుత్ రాయితీ అమలు కనుమూరు రఘు రామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అందుకు అనేక చర్యలు తీసుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘు రామకృష్ణరాజు తెలిపారు. గత ఆరు నెలల్లో ఆక్వారంగం పురోభివృద్ధిపై బుధవారం విజయవాడ రూరల్ పెనమలూరు మత్స్య శాఖ కమీషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘు రామకృష్ణ రాజు మాట్లాడుతూ పది ఎకరాల లిమిటేషన్ లేకుండా ఆక్వా రంగానికి రూ. 1.50 రూపాయల విద్యుత్ చార్జీ లు అమలు చేస్తున్నామన్నారు. దీని పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారన్నారు. ఈ విద్యుత్ టారిఫ్ అమలు వల్ల రైతుల కల సాకారం అవుతుందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మూడు లక్షల ఎకరాల వరకు ఆక్వా రంగం సాగు చేస్తున్నారన్నారు. ఆక్వా రంగానికి ఎప్పుడూ ఏదొక సమస్య చుట్టుముడుతుందన్నారు. అది యాంటీ డంపింగ్ డ్యూటీ ట్యాక్స్ రూపంలో ఇప్పుడు వచ్చిందన్నారు. దీనివల్ల రైతులపై ఆరు వందల కోట్ల భారం 2024-25 సంవత్సరానికి పడుతుందన్నారు. ముప్పై రోజుల్లో చెల్లించాలనేదానిపై ప్రభుత్వం చర్చలు చేస్తుందన్నారు. రైతులు ఒకేసారి కట్టలేరు కాబట్టి ఆలోచన చేస్తున్నాం అని ఈ విషయంలో ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఎక్కువ సాయం చేస్తుందన్నారు. రొయ్యల సాగు మరింత పెంచి స్థానిక వినియోగం పెంచాలా చర్యలు చేపడుతున్నామన్నారు. అందుకోసం ఎపి ఫ్రాన్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (APPPC) పేరుతో నలభై కోట్ల కార్పస్ ఫండ్ తో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రొయ్యల ప్రోత్సాహానికి వంద గ్రాముల నుంచి కిలో వరకు ప్యాక్ చేసి స్థానిక మార్కెట్ ను పెంచుతామన్నారు. మటన్ కంటే రొయ్యలో ఎక్కువ ప్రోటీన్ ఉందని, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రచారం చేస్తామన్నారు. ఎగుమతులు కు ఇబ్బంది ఉన్నా… రైతులు తట్టుకుని నిలబడే పరిస్థితి ఈ చర్యలు వల్ల వస్తుందన్నారు. ఆక్వా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. 2020 ఏప్రిల్ మొదటి వారంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన సముద్ర ఆహార ఉత్పత్తులపై అమెరికా పరస్పర సుంకాలను విధించిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రభుత్వం G.O.Rt.No.128 AHDDF విభాగం, GOAP తేదీ. 09.04.2025 ని జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలతో సహా ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను అధ్యయనం చేయడానికి మరియు పర్యవేక్షించడానికి ఆక్వాకల్చర్ సలహా కమిటీని నియమించినదన్నారు. మూడు నెలల క్రితం ఆక్వా ఎగుమతుల పై సంక్షోభం నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిపుణులు తో చర్చించిందన్నారు. ఫీడ్ ఉత్పత్తిదార్లతో చర్చలు జరిపి ధర తగ్గించామన్నారు. దీనివల్ల పెద్ద ఫార్మర్స్ కి ఉపయోగకరంగా ఉందని, చిన్న రైతులు కూడా 14 రూపాయల వరకు ఎమ్మార్పీ ధర తగ్గించాలని కోరారన్నారు. వారికి కూడా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా పాండ్స్ నమోదును 100% అమలు చేయడం, వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడం, క్లస్టర్ ఫామ్ నిర్వహణను ప్రోత్సహించడం, ప్రపంచ ప్రీమియం మార్కెట్ల కోసం తినడానికి సిద్ధంగా ఉన్న రొయ్యలను ప్రోత్సహించడం ద్వారా ఉత్పత్తి శ్రేణుల విస్తరణ చేపడతామన్నారు.రొయ్యల మేత ధర ఎమ్మార్పీ కిలోకు రూ. 94.00 కు తగ్గించడం 01-07-2025 నుండి అమలులోకి వచేట్టుగా నిర్ణయించడం జరిగిందన్నారు. దేశీయ వినియోగాన్ని పెంచడానికి నెక్ (NECC) నుండి ప్రేరణ పొంది ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల కంపెనీ (APPPC) ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు. ఆక్వాకల్చర్ ఆపరేటర్లు మరియు ఆక్వాకల్చర్ వ్యాపార నిర్వాహకులతో వరుస సంప్రదింపుల సమావేశాల తర్వాత అప్సడా (APSADA) చట్టం 2020, చేపల దాణా (నాణ్యత నియంత్రణ) చట్టం 2020 మరియు AP ఆక్వాకల్చర్ సీడ్ (నాణ్యత నియంత్రణ) (సవరణ) చట్టం 2020 కి మత్య్సశాఖ కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ప్రతిపాదిత సవరణలు లైసెన్సింగ్ విధానాలను సులభతరం చేస్తాయి, లీజు అవసరాలను తగ్గిస్తాయి, డీమ్డ్ ఆమోదాలను ప్రారంభిస్తాయి, ట్రేసబిలిటీ అవసరాలను పెంచుతామన్నారు. 11 అంకెల ప్రత్యేక కోడ్‌లను ప్రతి యూనిట్ కు కేటాయించింది. ట్రేసబిలిటీ యాప్‌ను త్వరలో అభివృద్ధి చేసి ప్రారంభించనున్నామన్నారు. దీనిలో ఫీల్డ్ డేటా ఎంట్రీ నమోదు చేయబడుతుంది మరియు ప్రతి చెరువుకు క్యూఆర్ కోడ్ జనరేషన్ ఉత్పత్తి చేయబడుతుందన్నారు. ఇది సెంట్రల్ డాష్ బోర్డ్, రియల్ టైమ్ మానిటరింగ్ మరియు విశ్లేషణలతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి దారితీస్తుందన్నారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి మరియు గ్రామీణ సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ నీటి వనరులలో సబ్సిడీ ధరలకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.. ఎస్సీ, ఎస్టీ మత్స్యకారుల సహకార సంఘాలకు ఉచితంగా చేప విత్తనాలను సరఫరా చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆక్వాకల్చర్ రంగం లో ఆరు నెలల్లో సాధించిన పురోగతిని వివరించారు.. రొయ్య, చేప ఎగుమతి లో ట్రేస్ బులిటీ ముఖ్యమన్నారు. నవంబర్, డిసెంబరు లోగా ప్రతి పాండ్ కు సంబంధించి వివరాలు అందిస్తామన్నారు. రొయ్య లోడ్ తో బయలుదేరితే… ఆ చరిత్ర, లొకేషన్ మొత్తం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. వాళ్లు జనవరి వరకు సమయం ఇచ్చినా… మనం డిసెంబరు నాటికే సన్నద్ధం అవుతున్నామన్నారు. యూనిక్ నెంబరు స్కాన్ చేస్తే మొత్తం వివరాలు తెలుసుకోవచ్చన్నారు. యాప్ కూడా రెండు నెలల్లో సిద్దం అవుతుందన్నారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ఇప్పటికే సాగు ధరలు తగ్గించి రైతులకు ఖర్చు తగ్గించామన్నారు. ఇప్పుడు కరెంటు ధర కూడా తగ్గిస్తే లక్షలాది మంది ఆక్వా రైతులకు మేలు జరుగుతుందన్నారు. రిజర్వాయర్ లకు సంబంధించి జిల్లా స్థాయి టెండర్లు రద్దు చేశామన్నారు. స్టేట్ వైడ్ టెండర్లు పెట్టి రిజర్వాయర్ ల్లో నీటిని నింపే కాంట్రాక్టు లు ఇస్తున్నామన్నారు. 16 మందితో అడ్వైజరీ కమిటీ వేశామని, ఈ కమిటీ యాక్టివ్ గా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో మత్స్య శాఖ అడిషనల్ డైరెక్టర్లు ఎస్. అంజలి, జాయంట్ డైరెర్టర్లు లాల్ మహ్మద్, సురేష్ తదతరలు పాల్గొన్నారు.