*ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 06, 2025 బుడమేరు వరద నివారణ పనులను వేగవంతం చేయండి అధికారులూ నిరంతరం పర్యవేక్షించండి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, వర్షాకాలం నేపథ్యంలో బుడమేరు వరద శాశ్వత నివారణకు సంబంధించి చేపట్టిన ఫ్లడ్ డ్యామేజ్ రెస్టోరేషన్ (ఎఫ్‌డీఆర్), ఇతర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ జి.కొండూరు మండలం వెలగలేరు వద్ద రెగ్యులేటరీ, బుడమేరు దానికి సంబంధించిన పులివాగు, బుడమేరు డైవర్షన్ ఛానల్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఇప్పటికే చేపట్టిన పనులు, వాటిలో పురోగతి, ఇంకా అవసరమైన సమయంతో పాటు క్యాచ్ మెంట్ ఏరియా, గండ్లు పడిన ప్రాంతాలు తదితరాలకు సంబంధించి మ్యాపులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. బుడమేరు వరదలకు శాశ్వత పరిష్కారంగా ఏజెన్సీ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించి, వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలిచ్చారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అదనపు మెషినరీ, సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. రోజువారీ వర్క్ షెడ్యూల్ ప్రకారం పనుల పూర్తికి కృషిచేయాలని, నిరంతరం పనుల పరోగతిని సమీక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, ఇరిగేషన్ ఎస్ఈ ఆర్.మోహన్‌రావు, విజయవాడ స్పెషల్ డివిజన్ ఈఈ పి.గంగయ్య తదితరులుపాల్గొన్నారు.