సమస్యలు వింటూ పరిష్కారం దిశగా. బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Spread the love

 సమస్యలు వింటూ పరిష్కారం దిశగా.

బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్

సమస్యలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. సోమవారం సాయంత్రం  కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్  కి వినతి పత్రాలు సమర్పించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడుతానని  పవన్ కళ్యాణ్  హామీ ఇచ్చారు. 

బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి…  

కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదుగురు స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని కోరారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలి అని విజ్ఞప్తి చేశారు.

వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన శ్రీమతి కృష్ణవేణి అనే మహిళ  పవన్ కళ్యాణ్  దృష్టికి తీసుకొచ్చారు. తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. 

తమ కుమారుడిని తన స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేశారని అయితే పోలీసులు దానిని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారని చోడవరానికి చెందిన  సోమాదుల కృప అనే మహిళ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని  పవన్ కళ్యాణ్ ని కోరింది. 

విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావడం లేదని  పవన్ కళ్యాణ్  విన్నవించుకున్నారు.

అంతకు ముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయం దగ్గరా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన శ్రీమతి నిమ్మగడ్డ అనురాధ అనే మహిళ స్థానిక పంచాయతీలోని అవకతవకలపై ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని అందించారు. సీనియర్ సిటిజన్స్ తమ సమస్యలను వివరించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *