మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పూర్తిస్థాయి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం .. మంత్రి కొల్లు రవీంద్ర

Spread the love

మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

పూర్తిస్థాయి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం .. మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: జూలై 31, 2024

మంగినపూడి బీచ్ ను పూర్తిస్థాయి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామని, త్వరలో పూర్తిగా ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

బుధవారం ఉదయం ఆయన అధికారులతో కలిసి మంగినపూడి బీచ్ సందర్శించి, మౌలిక వసతుల కల్పన, బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-2019 నాటి టిడిపి ప్రభుత్వ పరిపాలనలో మంగినపూడి బీచ్ కు ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులు, బీచ్ పరిసర ప్రాంతాలను మెరక చేయడం వంటి అభివృద్ధి పనులు చేశామని, తర్వాత వచ్చిన ప్రభుత్వం బీచ్ అభివృద్ధిని కొనసాగించడం కాకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. 

మంగినపూడి బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బీచ్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఇతర కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో పాటు పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. విద్యుత్ దీపాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసి బీచ్ సందర్శన సమయాలను పొడిగిస్తామని, అదేవిధంగా సందర్శకులకు బీచ్ లో ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా ఉండేందుకు ఫ్లోటింగ్ రోప్స్, రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు.

మాస్టర్ ప్లాన్ రూపొందించిన అనంతరం అవసరమైన నిధులను సమకూర్చుకున్న వెంటనే మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తిగా ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సమావేశంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఆర్కిటెక్చర్ కిరణ్, పర్యాటకశాఖ జిల్లా అధికారి జి రామ లక్ష్మణరావు, ఇంచార్జ్ తహసిల్దార్ సౌజన్య, వీఆర్వో గణేష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *