19-08-2024
దేశంలో అంతరిక్ష పరిశోధనలకు ప్రధాని మోదీ సహకారం మరువలేనిది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
జాతీయ అంతరిక్ష దినోత్సవ-2024 వేడుకలు
విజయవాడ : భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందిస్తున్న సహకారం మరువలేనిదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. హైడ్రోలాజీ వాటర్ రీసోర్స్ డిపార్టమెంట్ సహకారంతో రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం-2024 వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అలాగే విద్యార్ధులు, పలు కాలేజీ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం అంతరిక్ష సాంకేతిక పరిజ్జానం వినియోగించి ప్రజలకు దైనందిన జీవితంలో ఉపయోగపడే యంత్రపరికారలు తయారు చేసిన విద్యార్ధులతో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో అంతరిక్ష సాంకేతి పరిజ్ఞాన వినియోగం బాగా పెరిగింది. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు ఇంత అభివృద్దిలో సాధించటానికి శాస్త్రవేత్త విక్రమ్ సారాబాయ్, మాజీ రాష్ట్రపతి, సైంటిస్ట్ అబ్దుల్ కలాం చేసిన సేవలు మరువలేనవన్నారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనలలో 2023 ఆగస్టు 23 వ తేదీ ఒక చారిత్రాత్మకమైన ఘట్టం జరిగింది. ఇస్రో తయారుచేసిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు దక్షిణ ధ్రువం చంద్రుని ఉపరితలం తాకి భారతీయలు గర్వపడేలా చేసిందన్నారు. ఈ అపూర్వ విజయానికి గుర్తుగా, యువతకి స్పూర్తి నిచ్చేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏడాది ఆగస్టు 23 వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవం గా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. .
అంతరిక్ష పరిశోధనలలో జరిగిన ప్రగతిని, చంద్రుడిపై వేసిన తొలి అడుగుతో సాధించిన విజయాన్ని ఆస్వాదించడమే కాకుండా మన దైనందిక జీవితాలపై అంతరిక్ష సాంకేతికత ప్రభావం ఏ విధంగా వుందనే విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా వుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జల వనరుల శాఖ జరుపుతున్న మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో భాగంగా కావటం ఎంతో సంతోషంగా వుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు , వివిధ రంగాలకు చెందిన సైంటిస్టులు హాజరు కావడం పై హర్షం వ్యక్తం చేశారు. ఉందన్నారు.ఈ సమావేశంలో జలవనరుల నిర్వహణ కొరకు అంతరిక్ష సాంకేతికతను ఏకీకృతం చేయడంపై లోతైన చర్చలు జరగాలని సూచించారు.
సహజ వనరుల పరిరక్షణ, ముఖ్యంగా జల వనరుల పర్యవేక్షణ నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశం పై అవగాహన పెంపొందించుకోవడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం కావాలన్నారు.
ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు వివిధ రంగాలలో అంతరిక్ష సాంకేతికత పోషిస్తున్న సమగ్ర పాత్ర పై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, మన దేశ యువతలో క్రియాశీలక ఆలోచనలను రేకెత్తించి, అంతరిక్ష సాంకేతికతను అందిపుచ్చుకొని, పరిశోధనలలో భాగస్వామ్యులను చేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావు , హెడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఇంజనీర్ కే శ్రీనివాస్, ఎ.పి.ఎస్.ఐ.డి.సి మేనేజింగ్ డైరెక్టర్ ఎం లక్ష్మీనారాయణ, జి.డబ్ల్యూ అండ్ డబ్ల్యూ .ఎడిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎం జాన్ సత్య రాజు , ఎన్.ఆర్.ఎస్.సి. అండ్ ఇస్రో శాస్త్రవేత్త కే భరత్ కుమార్ రెడ్డి , హైదరాబాద్ సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ మన్ను జి ఉపాధ్యాయ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త వి ఆర్ రాణి , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ శాస్త్రవేత్త ఎస్ వి విజయ్ కుమార్ , వి ఎస్ జయకేతన్ , ఏపీఅండ్ తెలంగాణ భౌగోళిక డైరెక్టరేట్ డైరెక్టర్ బి సి పరీదా , టి.ఎ.ఎమ్.సి., ఎన్.పి.ఎమ్.యు, ఎన్,హెచ్.పి సభ్యులు మురళి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు…