*19.08.2024*
గాయత్రీ సొసైటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సామూహిక ఉపా కర్మ కార్యక్రమం
*పేద బ్రాహ్మణులకు చేయూతనందించడంలో గాయత్రీ సొసైటీ పాత్ర అభినందనీయం: మల్లాది విష్ణు*
శ్రావణ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణపురంలోని శ్రీ గాయత్రి కళ్యాణ మండపం నందు నూతన వటువులకు ఉపా కర్మ కార్యక్రమం శ్రీ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేసి వటువులకు దివ్య ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆచరించవలసిన నియమాలపై వటువులకు వివరించారు. ప్రతిఒక్క వటువు త్రికాల సంధ్యావందనం, గాయత్రీ మంత్రోపాసనం తప్పనిసరిగా ఆచరించాలన్నారు. అప్పుడే వారి జీవన స్థితిగతులు ఉన్నత స్థాయికి చేరుకుంటాయన్నారు. ఈ సందర్భంగా త్రికాల సంధ్యావందన విశిష్టతను వివరించారు. సంధ్యావందనం సమయంలో సూర్య శక్తిని పొందేందుకు మనషికి ఉన్న శక్తి చాలదు కనుక గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించడం జరుగుతుందన్నారు. ప్రతిఒక్క బ్రాహ్మణుడు తన దైనందిన జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ త్రికాల సంధ్యావందనాన్ని మరువకూడదని తెలిపారు. అలాగే 16 ఏళ్ల వయస్సు లోపే ఉపనయనాలను పూర్తిచేసుకోవలసిందిగా బ్రాహ్మణ బాలురకు మల్లాది విష్ణు సూచించారు. అలాగే బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతికి దశాబ్ధానికి పైగా గాయత్రీ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఏటా సామూహిక ఉపనయన మహోత్సవాలు, ఉపా కర్మ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు. ఎన్నో రోజుల నుంచి కార్యక్రమ నిర్వహణకై కార్యాచరణ రూపొందించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం పట్ల నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, జె.కె.సుబ్బారావు, మారుతీ ప్రసన్న, చాంద్ శర్మ, సనత్, వటువులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.