ఏలూరు/ ముదినేపల్లి, డిసెంబర్, 27 : రాష్ట్రంలోని 17 వేల 600 గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. పి . సిసోడియా చెప్పారు.
ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో జరిగిన రెవిన్యూ సదస్సులో కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి తో కలిసి సిసోడియా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భూ సమస్యలపై అందించిన వినతిపత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. పి . సిసోడియా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా భూ సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నదన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో డిసెంబర్, 6వ తేదీ నుండి జనవరి, 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని గ్రామాలలోనూ రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని, జనవరి, 8వ తేదీ తరవాత ఏదైనా గ్రామాలు మిగిలిపోతే వాటిల్లో కూడా రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. రెవిన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి విచారణ చేసి పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలకు మేలు చేసేందుకు రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవిన్యూ సదస్సులలో అందిన జఠిలమైన సమస్యల పరిష్కారానికి సవివరంగా విచారణ చేసి పరిష్కారానికి కొంత సమయం పడుతుందన్నారు. మీ భూమి మీద మీకు మాత్రమే హక్కు కల్పించేలా రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. రెవిన్యూ సదస్సులలో భూ సమస్యలు పెద్దఎత్తున పరిష్కారం కావడం పట్ల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
*ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాకు ఎంతో అనుబంధం ఉంది: సిసోడియా* తాను 1992 లో ఐఏఎస్ అనంతరం క్షేత్రస్థాయి శిక్షణ అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లోనే జరిగిందని, పోడూరు లో విఆర్ఓ గా, భీమవరంలో తహసీల్దార్ , కొవ్వూరులో ఆర్డీఓ శిక్షణ పొందానున్నారు. శిక్షణా సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్, ఎస్పీ లు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఈ జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమని , ఏ ఒక్క అవకాశం దొరికినా ఈ జిల్లాను వచ్చేందుకు ఆసక్తి చూపిస్తానని సిసోడియా చెప్పారు.
కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి, వైవాక, భాస్కరరావుపేట, తదితర గ్రామాలలో వేలాది ఎకరాలకు సంబందించిన భూ సమస్యలు ఉన్నాయన్నారు. కైకలూరు నియోజకవర్గంలో భూ సమస్యలు పరిష్కారాన్ని తమ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేస్తామని, ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తే, వారు ఏ కార్యాలయంనకు తిరగనవసరం లేకుండా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, సదస్సులలో అందిన ప్రతీ విజ్ఞప్తిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నామని, పరిష్కార విధానాన్ని దరఖాస్తుదారులకు తెలియజేస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, తహసీల్దార్ జె. సుభాని, సర్పంచ్ ఘంటా రాకేష్ కుమార్, ప్రముఖులు చల్లగుళ్ళ శోభనాధ్రిచౌదరి, ప్రభృతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజ్ఞప్తుల స్వీకరణ, కంప్యూటరైజేషన్ విధానాలను సిసోడియా పరిశీలించారు.