*ఎన్టీఆర్ జిల్లా (జి.కొండూరు), మార్చి 01, 2025*
దీర్ఘకాలిక భూ సమస్యలకు రీసర్వేతో చెక్
– *అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే ప్రక్రియ*
– *ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
రీసర్వేతో దీర్ఘకాలిక భూ సమస్యలకు చెక్ పెట్టొచ్చని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే కార్యకలాపాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ రైతులకు వివరించారు.
శనివారం ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం, గడ్డమనుగులో కలెక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పర్యటించి రీసర్వే పురోగతిని పరిశీలించారు. ఫీల్డ్ గ్రౌండ్ ట్రూతింగ్ (భూమిపై కచ్చితత్వం) పనులు ఏ మేరకు జరుగుతున్నాయనే దానిపై తనిఖీ చేశారు. భూ మ్యాపులను పరిశీలించారు. గ్రామంలోని రైతులతో మాట్లాడారు. రీసర్వేతో కలిగే ప్రయోజనాలను వివరించి, రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. ఫీల్డ్‌లో రోవర్ ఏ విధంగా పనిచేస్తుందో రైతులకు అవగాహన కల్పించారు. రీ సర్వే చేయడం వల్ల రైతులకు ఏవిధమైన కచ్చితమైన కొలతలతో మున్ముందు రికార్డులు అందుబాటులోకి వస్తాయనే దాన్ని వివరించారు. అదేవిధంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రైతులకు కచ్చితమైన భూ రికార్డులను అందించేందుకు చొరవచూపాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే పనులను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్ వెంట అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే, భూ రికార్డులు) టి.త్రివిక్రమరావు తదితరులు ఉన్నారు.