తుపాను నష్టంపై ప్రతి రైతుకూ పరిహారం అందేలా చర్యలు విద్యుత్ పునరుద్ధరణ పనులు సాయంత్రంలోగా పూర్తి చేస్తాం

Spread the love

తుపాను నష్టంపై ప్రతి రైతుకూ పరిహారం అందేలా చర్యలు విద్యుత్ పునరుద్ధరణ పనులు సాయంత్రంలోగా పూర్తి చేస్తాం
పల్నాడు జిల్లాలో పంట నష్టాల పరిశీలన.. రైతులకు మంత్రి గొట్టిపాటి భరోసా
రెండు వేల మందికిపైగా ఇతర రాష్ట్రాల సిబ్బందితో సహాయక చర్యలు

చిలకలూరిపేట / అద్దంకి: తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రతి రైతునూ గుర్తించి, నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులందరినీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బుధవారం తొలుత పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పరిసర తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటితో కలిసి ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని రైతులు మంత్రికి వివరించారు. అర్హులైన ఏ ఒక్క రైతూ నష్టపరిహారం అందకుండా మిగిలిపోకూడదని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి పంట నష్టాన్ని నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

అనంతరం అద్దంకిలో పర్యటించిన మంత్రి.. తుపాను ప్రభావం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలపై వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు, సమన్వయంతో అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం జరగకుండా పరిస్థితిని ఎదుర్కోగలిగామని తెలిపారు. తుపానుకు రెండు రోజుల ముందే విద్యుత్ సిబ్బందిని, అవసరమైన సామగ్రిని సిద్ధం చేశామని చెప్పారు.

మూడు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు నష్టం
తుపాను ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ప్రజలు గత రెండు రోజులుగా విద్యుత్ అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. సరఫరాను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కర్ణాటక, తమిళనాడు నుంచి రెండు వేల మందికిపైగా సిబ్బంది వచ్చి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వెల్లడించారు. ఏపీఎస్పీడీసీఎల్ నుంచి మరో వెయ్యి మంది సిబ్బందిని ప్రకాశం, పల్నాడు జిల్లాలకు పంపినట్లు చెప్పారు. సీఎండీ నుంచి లైన్‌మెన్‌ వరకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో సేవలందిస్తూ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని వివరించారు. తెగిపడిన విద్యుత్ లైన్లు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే క్రమంలో సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చోట అదనపు సిబ్బంది, సామగ్రిని వినియోగించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బాపట్ల జిల్లాలోనూ తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన
అనంతరం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో మురసు తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి వచ్చి సేవలందిస్తున్న విద్యుత్ సిబ్బందిని కలిసి వారి పనితీరును అభినందించారు. చీరాలలో తమిళనాడు నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బంది చేపడుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించి వారితో మాట్లాడారు. తుపాను వంటి క్లిష్ట పరిస్థితుల్లో సొంత ప్రాంతాలను విడిచి వచ్చి ప్రజలకు విద్యుత్ సేవలు అందిస్తున్న సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు.

Loading