ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ఘన విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనం ప్రజా విజయంతో మరింత బాధ్యత పెరిగింది.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం

Spread the love

ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ఘన విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనం ప్రజా విజయంతో మరింత బాధ్యత పెరిగింది.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం

సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే కూటమికి భారీ విజయం: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని

విజయవాడ(ఎంపీ కార్యాలయం)ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని, ఈ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు.

కూటమి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు సమన్వయంతో, సమిష్టి కృషితో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందని, తాజా ఎన్నికల ఫలితాలు మరోసారి ఆ విషయాన్ని నిరూపించాయని తెలిపారు.

ఈ ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు మంచి విజయాలు సాధించారని ఎంపీ చిన్ని వెల్లడించారు. తిరువూరు నుంచి జనసేన పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పాటు, జనసేన మేయర్ అభ్యర్థి రాధాకృష్ణన్ కూడా విజయం సాధించారని తెలిపారు. మరో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.

ప్రజా విజయంతో మరింత బాధ్యత పెరిగింది

ప్రజలు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ ఐక్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.

కూటమి నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయడం వల్లే ఎన్నికల్లో కూటమి క్రమశిక్షణ మరోసారి నిరూపితమైందన్నారు. ఎన్నికల సమయంలో సహకరించిన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో సమన్వయంతో వ్యవహరించి సహకరించిన మల్లికార్జున్, ప్రశాంత్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి విజయమే లక్ష్యం

రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కూటమి సమష్టి కృషితో భారీ విజయాన్ని సాధించబోతోందని ఎంపీ చిన్ని ధీమా వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా రెండు స్థానాల్లో జనసేన పార్టీ, ఒక స్థానంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనున్నాయని, మిగిలిన 14 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. మొత్తం 17 స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

జెడ్పీ చైర్మన్ అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది

ఎన్టీఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిందని ఎంపీ చిన్ని తెలిపారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు ఉన్న నేపథ్యంలో, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ప్రజలు మంచి పాలనను కోరుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనపై విశ్వాసంతోనే ఈ స్థాయిలో విజయాన్ని అందించారని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ఈ విజయం కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదని, ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకానికి ప్రతిరూపమని అన్నారు.

రానున్న రోజుల్లో కూడా ఇదే ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు.

Loading