ఉపాధి కేంద్రాలుగా గ్రామాలు మహిళా శక్తికి వేదికగా సరస్‌ మేళా-2026

Spread the love

ఉపాధి కేంద్రాలుగా గ్రామాలు మహిళా శక్తికి వేదికగా సరస్‌ మేళా-2026

మహిళా సాధికారతే వికసిత్‌ భారత్‌కు పునాది

గ్రామీణ మహిళల ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌

విజయవాడలో సరస్‌ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు

విజయవాడ, అక్టోబరు 15: గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు స్వయం ఏపీ బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో లక్ష మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, మరో ఐదు లక్షల మందిని ఆ దిశగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విజయవాడలో తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ సరస్‌ మేళా-2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దసరా శరన్నవరాత్రుల వేళ జాతీయ సరస్‌ మేళా నిర్వహించడం విజయవాడకు మరింత శోభ తెచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించి ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె.. ఎన్నో సవాళ్లను అధిగమించి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించారని కొనియాడారు. సంకల్ప బలం, ధైర్యం ఉంటే మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆమె నిరూపించారని తెలిపారు. జాతీయ సరస్‌ మేళాలో 650 స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నాయని సీఎం తెలిపారు. ఇది కేవలం 14 రోజులపాటు జరిగే ప్రదర్శన కాదని, గ్రామీణ మహిళల ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెట్‌ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం మేళా ప్రధాన ఉద్దేశమని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల మహిళలు తమ అనుభవాలను పంచుకోవడంతోపాటు విజయగాథలను తెలుసుకోవాలని, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించాలని సూచించారు.

రూ.69 వేల కోట్ల టర్నోవర్‌తో డ్వాక్రా సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లో 11 లక్షల స్వయం సహాయక సంఘాలు, 1.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ఈ సంఘాల ద్వారా రూ.69 వేల కోట్ల టర్నోవర్‌ నమోదవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు 3.5 కోట్ల మందికి చేరుతున్నాయని వివరించారు. గతంలో వెలుగు కార్యక్రమం ద్వారా మహిళలు సంపద సృష్టించే దిశగా అడుగులు వేశారని గుర్తుచేశారు. నిన్నటి వరకు పొదుపు సంఘాలుగా ఉన్న ఎస్ హెచ్ జీలు నేడు వ్యాపార సంస్థలుగా ఎదుగుతున్నాయని.. భవిష్యత్తులో అంతర్జాతీయ బ్రాండ్లుగా మారాలని సీఎం ఆకాంక్షించారు. మహిళలు ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వేదికల ద్వారా స్వయం ఏపీ పేరుతో మార్కెటింగ్‌ చేస్తామని తెలిపారు. వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలను వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ మార్కెట్ల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు మహిళల ఉత్పత్తులు చేరేలా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. మహిళల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించు కున్నప్పుడే వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోగలమని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించడం, వారి ఆలోచనలకు విలువ ఇవ్వడం, కలలను సాకారం చేసుకునేందుకు అవసరమైన అవకాశాలు, సహకారం అందించడం సమాజ బాధ్యత అని అన్నారు.

ప్రతి గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలి

సంక్షేమ పథకాలతో మహిళలకు భరోసా కల్పిస్తూనే, ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం పథకంతో పిల్లల చదువుకు అండగా నిలుస్తున్నామని, దీపం పథకంతో మహిళల ఖర్చులను తగ్గిస్తున్నామని చెప్పారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 100 కోట్ల ప్రయాణాలు చేశారని వెల్లడించారు. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు సహా పలు ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమం నుంచి అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలను ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ విధానమని వివరించారు. ప్రతి స్వయం సహాయక సంఘం ఒక చిన్న ఆర్థిక శక్తిగా, ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా, ప్రతి గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిళల భద్రత, ఆత్మగౌరవం, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు. ఇంట్లోని ప్రతి మహిళను ప్రోత్సహించాలని, వారి కలలు నిజం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్రగవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అనిత తదితరులు హాజరయ్యారు.

Loading