విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం

Spread the love

విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ: కృష్ణమ్మ నదీ తీరాన పున్నమి ఘాట్ వేదికగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌–2.0 వేడుకలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, ఈ ఉత్సవాల ద్వారా విజయవాడ నగర సాంస్కృతిక వైభవం, కళలు, సంప్రదాయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌–2.0 కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణను అభినందిస్తూ, విజయవాడ నగరానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ మాట్లాడుతూ, విజయవాడలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని, విజయవాడ ఉత్సవ్‌–2.0ను అద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా దేశంలోని ప్రతి ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలకు తగిన గుర్తింపు లభించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు.

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నగరంలోని వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములుగా చేస్తూ ఇంత భారీ స్థాయిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయవాడలో దసరా వేడుకలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులందరూ సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. జాతీయ సరస్ మేళా ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల మహిళా స్వయం సహాయక సంఘాలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, జాతీయ సరస్ మేళాను విజయవాడకు తీసుకురావడంలో సహకరించిన కేంద్ర మంత్రి కమలేష్ పాస్వాన్‌కు నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీని దాటి జాతీయ సరస్ మేళాను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించడం ప్రత్యేకమైన విషయమని, దీని ద్వారా డ్వాక్రా మహిళలు, గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌కు పరిచయం చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ సహకారంతో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ అనేది కేవలం నిర్వాహకుల కార్యక్రమం మాత్రమే కాదని, నగర ప్రజలందరూ భాగస్వాములై జరుపుకునే ప్రజా పండుగ అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందిస్తున్న సహకారం, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో విజయవాడ ఉత్సవ్‌–2.0 మరింత వైభవంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పలువురు ముఖ్యమంత్రులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న నేపథ్యంలో విజయవాడ నగరానికి మరింత ప్రాచుర్యం లభించనుందని తెలిపారు.

విజయవాడ ఉత్సవ్‌–2.0తో పాటు నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా మహిళా సాధికారతకు, గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహానికి వేదికగా నిలుస్తోందని, స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించడం, నగర సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెప్పడం ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, చైర్మన్లు పట్టాభి, రఘురామరాజు, ఎరబోతు రమణ, తేజస్వి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ప్రతినిధి ముత్తవరపు మురళి, సినీ నటులు మురళీమోహన్, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Loading